Yasin Malik Sentenced To Life : ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారయ్యింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ ను ఈ నెల 16న దోషిగా తేల్చిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు...అతడికి ఇవాళ జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. యాసిన్ మాలిక్ కు మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ గట్టిగా వాదించింది. అయితే కోర్టు మాత్రం యావజ్జీవ శిక్ష విధించింది. అయితే.. శిక్ష విషయంలో మాలిక్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.."నేను ఏమీ అడగను. అంతిమ నిర్ణయం న్యాయస్థానానిదే. నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. గత 28 ఏళ్లలో తాను హింసకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాలిక్ చెప్పాడు. ఉరిశిక్ష వేసినా సమ్మతమే"అని కోర్టుకు నివేదించారు.
యాసిన్ మాలిక్‌కు రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10 లక్షల జరిమానా, అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయబడతాయని కోర్ట్ తీర్పు చెప్పింది. యాసిన్ మాలిక్ తో పాటు పలువురు వేర్పాటువాదుపై కూడా ఎన్ఐఏ అభియోగాలు మోపింది. కాశ్మీర్ లో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా ఓ ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని యాసిన్ మాలిక్ టెర్రరిస్టులను ప్రోత్సహించాడు. ఈ కేసులో లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ లపై కూడా ఎన్ ఐ ఏ ఛార్జీషీట్ ఫైల్ చేసింది.
ALSO READ Major Accident : ట్రెక్కింగ్ కి వెళ్తూ..కారు వాగులో పడి ఆరుగురు మృతి
జమ్ముకశ్మీర్ లో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండిట్లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్ఎఫ్కు సంబంధాలు ఉన్నాయి
యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో హైఅలెర్ట్ ప్రకటించారు. ఉదయం నుంచి శ్రీనగర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్రోహశక్తులు అరాచకాలకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ ను కట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.