హోమ్ /వార్తలు /జాతీయం /

అహ్మద్ పటేల్‌కి షాక్... బారుచ్ లోక్ సభ టికెట్ ఇవ్వని కాంగ్రెస్... ఫలించని వ్యూహం...

అహ్మద్ పటేల్‌కి షాక్... బారుచ్ లోక్ సభ టికెట్ ఇవ్వని కాంగ్రెస్... ఫలించని వ్యూహం...

అహ్మద్ పటేల్ (Image : Twitter)

అహ్మద్ పటేల్ (Image : Twitter)

Lok Sabha Elections 2019 : వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన అహ్మద్ పటేల్... తనకు టికెట్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యారా?

  యూపీఏ హయాంలో ఢిల్లీ కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన టాప్ టెన్ నేతల్లో అహ్మద్ పటేల్ పేరు కూడా ఉంటుంది. అలాంటి ఆయన... తనకు అచ్చొచ్చిన గుజరాత్‌లోని బారుచ్ నియోజకవర్గం నుంచీ లోక్ సభకు పోటీ చెయ్యాలని ప్రయత్నించి... పార్టీ టికెట్ అందుకోవడంలో ఫెయిలయ్యారని తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్...బీహార్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయనపై అక్కడి గెలుపు బాధ్యతలు ఉండటంతో... ఈసారి పోటీ చేయవద్దని పార్టీ హైకమాండ్ కోరినట్లు తెలిసింది. బుధవారం పార్టీ మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చెయ్యగా... అందులో ఆరుగురు పంజాబ్ నుంచీ, నలుగురు గుజరాత్, ముగ్గురు జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా నుంచీ ఇద్దరేసి... హిమాచల్ ప్రదేశ్, దాద్రానగర్ హవేలీ నుంచీ ఒక్కొక్క అభ్యర్థి ఉన్నారు. ఆ జాబితాలో అహ్మద్ పటేల్ పేరు మాత్రం లేదు.


  ప్రస్తుతం గుజరాత్ ‌నుంచీ రాజ్యసభ ఎంపీగా ఉన్న అహ్మద్ పటేల్‌కి బారుచ్‌లో మంచి పట్టుంది. అక్కడ గిరిజనులతోపాటూ... ముస్లిం మైనార్టీల సంఖ్య ఎక్కువ. ఐతే... ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వరాదని బారుచ్‌లోని కాంగ్రెస్‌లో ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో గుజరాత్ కాంగ్రెస్ రెండుగా విడిపోయినట్లు సమాచారం. 1991 నుంచీ అహ్మద్ పటేల్... లోక్ సభకు పోటీ చెయ్యట్లేదు. కానీ బారుచ్ నుంచీ ఆయన.. 1977, 1984, 1989లో ఆయన వరుసగా గెలుపొందారు. 1991లో బీజేపీ అభ్యర్థి చందూభాయ్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచీ ఆ సీటు బీజేపీ చేతిలోనే ఉంది.


  అహ్మద్ పటేల్‌ వ్యూహాలు పన్నడంలో దిట్ట. యూపీఏ మొదటి, రెండో ప్రభుత్వంలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆయన... వివిధ సందర్భాల్లో పార్టీని గట్టెక్కించడంలో, ప్రత్యర్థైన బీజేపీని ఇరకాటంలో పెట్టే విషయాల్లో తనదైన సలహాలూ, సూచనలూ ఇచ్చేవారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ అహ్మద్ పటేల్‌కి సత్సంబంధాలే ఉన్నాయి. ఇక అహ్మద్ పటేల్‌కి దేశవ్యప్తంగా సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. ఇన్ని పాజిటివ్ కోణాలు ఉండి కూడా ఆయన టికెట్ పొందడంలో ఫెయిలవ్వడంపై చర్చ జరుగుతోంది.


  కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వట్లేదు. గుజరాత్‌లోని బారుచ్ నుంచీ పోటీ చేయాలనుకుంటున్న ఆయన్ను కాంగ్రెస్ మరెక్కడైనా బరిలో దింపుతుందా... లేక... బీహార్‌కే పరిమితం చేస్తుందా అన్నదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ప్రధానంగా కాంగ్రెస్ బీహార్‌పై ఎక్కువ దృష్టి సారిస్తోంది. 40 లోక్ సభ స్థానాలుండటం, అక్కడి ప్రస్తుత నితీశ్ కుమార్ ప్రభుత్వ పాలన ఏమంత గొప్పగా లేదని భావిస్తున్న కాంగ్రెస్... బీహార్‌లో వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధించాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. అందుకే అక్కడ అహ్మద్ పటేల్‌ను రంగంలోకి దింపింది.


  2014 లోక్ సభ ఎన్నికల్లో... గుజరాత్‌లో ఉన్న 25 స్థానాల్నీ బీజేపీ గెలుచుకుంది. ఐతే... 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకుంది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో... బీజేపీని 99 స్థానాలకే పరిమితం చెయ్యగలిగింది. బారుచ్‌లో మూడోదశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి గురువారమే చివరి రోజు. అందువల్ల బారుచ్‌లో అహ్మద్ పటేల్ బరిలో దిగే అవకాశాలు లేవనే చెప్పొచ్చు.


   


  ఇవి కూడా చదవండి :

  ఒక్కసారి గెలిపించండి... నేనేంటో నిరూపిస్తా... ఇంటింటి ప్రచారంలో నటి మాధవీలత


  సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జనసేన బహిరంగ సభ... హాజరవుతున్న పవన్ కల్యాణ్, మాయావతి...


  ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలెందుకు... ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం మార్చారా...


  ప్రచారానికి ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లు... కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు... చాపర్ల అద్దెలు ఎంతో తెలుసా...

  First published:

  Tags: Ahmed Patel, Gujarat, Gujarat Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019

  ఉత్తమ కథలు