news18-telugu
Updated: November 25, 2020, 6:21 AM IST
ఆహ్మద్ పటేల్ (File)
Ahmed Patel passes away: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ల ఆయన... గత నెలలో కరోనా బారిన పడ్డారు. దాంతో... ఆయనకు అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అక్టోబర్ 1న ఇందుకు సంబంధించి అహ్మద్ పటేల్ ఓ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనీ... తనను రీసెంట్గా ఎవరెవరు కలిశారో... వారంతా టెస్ట్ చేయంచుకోవాలనీ, సెల్ఫ్ ఐసోలేట్ అవ్వాలని అహ్మద్ పటేల్ కోరారు. ఐతే... ఆయనకు కరోనా వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. దాంతో... శరీరంలోని రకరకాల అవయవాలు పనిచేయకుండా పోయాయనీ, అందువల్ల తన తండ్రి బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారని కొడుకు ఫైజల్ పటేల్... ట్వీట్ చేశారు.
"ఇదో బాధాకర విషయం. ఇలా చెబుతున్నందుకు చింతిస్తున్నాను. నా తండ్రి కన్నుమూశారు. బుధవారం ఉదయం 3.30కి తుదిశ్వాస విడిచారు. నెల కిందట కరోనా పాజిటివ్ వచ్చాక, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. అవయవాలు సరిగా పనిచేయలేదు. దయచేసి నేను అందర్నీ కోరేది ఒకటే. కరోనా నిబంధనలు పాటించండి. సమూహాలలోకి వెళ్లకండి. సేఫ్ డిస్టా్న్స్ పాటించండి. కరోనాతో జాగ్రత్త పడండి" అని ఫైజల్ పటేల్ ట్వీట్ చేశారు.
గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న అహ్మద్ పటేల్... కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన, మోస్ట్ సీనియర్ నేత. కాంగ్రెస్ ట్రెజరర్‌గా ఆయన పనిచేశారు. 8 సార్లు ఎంపీ అయిన ఆయన... తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులు. నవంబర్ 15న ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్... ICUలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అహ్మద్ పటేల్ అంత్యక్రియలను నిరాడంబరంగా జరుపుతామని ఆయన కుటుంబం తెలిపింది.మరో కాంగ్రెస్ సీనియర్ నేత, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూసిన రెండ్రోజుల తర్వాత అహ్మద్ పటేల్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం కాంగ్రెస్‌కి తీరనిలోటనుకోవచ్చు. 84 ఏళ్ల గొగోయ్ కూడా... కరోనా పాజిటివ్ అయ్యారు. ఆగస్టులో ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కొనసాగింది. తర్వాత డిశ్చార్జి అయినా... నవంబర్ 2న శ్వాస సమస్య రావడంతో... మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. చివరకు ఆయన కన్నుమూశారు.
Published by:
Krishna Kumar N
First published:
November 25, 2020, 6:13 AM IST