కరోనా మహమ్మారిపై పోరులో భారత్ గేరు మార్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలకు బూస్టర్ డోసును కూడా అందించేలా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. జనవరి 1 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకూ టీకాలు వేయనున్న కేంద్రం.. అదే నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, సీనియర్ సిటిజన్లకు కొవిడ్ మూడో టీకా అందించనుంది. కాగా, ఇతర వ్యాధులతో బాధపడే వృద్దులకు కొవిడ్ వ్యాక్సిన్ వేసే విషయంలో కేంద్రం గత మార్గదర్శకాలను సవరించింది. ఈ మేరకు తాజాగా వెలువడిన నిబంధనలిలా ఉన్నాయి..
ఇతర వ్యాధులతో బాధపడుతూ 'ప్రికాషనరీ డోస్' (బూస్టర్ డోస్) తీసుకోవాలనుకునే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బూస్టర్ డోసు పొందడానికి తమ పేరు నమోదు చేసుకోవాలకునే వారు మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే రిజిస్టర్ చేయించుకోవచ్చని, తెలిపింది. రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మంగళవారంనాడు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అరవై ఏళ్ల పైబడిన వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని అనుకుంటే డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. అయితే, వ్యాక్సిన్ తీసుకునే ముందు 60 ఏళ్లు పైబడినవారు తమ సొంత వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.
యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదా ఉండబోదని ఈసీ స్పష్టం చేసిన దరిమిలా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్ల క్యాటగిరిలోకి వస్తారని, ప్రికాషనరీ డోస్ (బూస్టర్) తీసుకునేందుకు వారు అర్హులని కూడా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రికాషనరీ డోస్ ఇవ్వడమనేది వాళ్లు అంతకుముందు రెండో డోసు ఎప్పుడు తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని, సెకెండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాతే వారు ప్రికాషనరీ డోస్ తీసుకునేందుకు అర్హులవుతారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Covid vaccine, India, Omicron