Home /News /national /

ఉగాది తర్వాత కర్ణాటకకు కొత్త సీఎం.. యడియూరప్ప దిగిపోతారంటూ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ఉగాది తర్వాత కర్ణాటకకు కొత్త సీఎం.. యడియూరప్ప దిగిపోతారంటూ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

బసనగౌడ యత్నాళ్

బసనగౌడ యత్నాళ్

కర్ణాటక రాజకీయాల్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కర్ణాటకలోని విజాపుర సిటీ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ సీఎం యడియూరప్పపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది తర్వాత కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు నూటికి నూరు శాతం తథ్యమని...

ఇంకా చదవండి ...
    బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కర్ణాటకలోని విజాపుర సిటీ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ సీఎం యడియూరప్పపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది తర్వాత కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు నూటికి నూరు శాతం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షల మేరకే ఈ మార్పు ఉండబోతోందని చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుపై ఎవరూ నోరు మెదపవద్దని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ యత్నాళ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర బీజేపీకి తలనొప్పిగా మారింది. అంతేకాదు, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారనే ప్రశ్నకు కూడా యత్నాళ్ పరోక్ష సంకేతాలిచ్చారు.

    ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరాయనంలో ప్రస్తుత సీఎం యడియూరప్ప జాతర జరిగిందని, ఇది ఉగాది నాటికి ముగియనుందని యత్నాళ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. కర్ణాటక బీజేపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేల సమావేశం కలకలం రేపుతోంది. ఒక పక్క శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే మరో పక్క 15 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, అప్పచ్చురంజన్, అభయ్ పాటిల్, అరవింద బెల్లద్, సతీష్ రెడ్డి సహా 15 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరయినట్లు సమాచారం.

    నాయకత్వ మార్పుపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే యత్నాళ్‌పై అధిష్టానం తగిన సమయంలో చర్యలు తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ చెప్పారు. ఈ తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సీఎంపై మంత్రులు ఆనంద్ సింగ్, ఈశ్వరప్ప అలకబూనారు. తాము సిఫార్సు చేసిన రామలింగప్పకు బుడా అధ్యక్ష పదవి ఇచ్చినట్టే ఇచ్చి 48 గంటల్లోపే రద్దు చేయడంతో మంత్రులిద్దరూ సీఎంపై అసంతృప్తితో ఉన్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Karnataka, Karnataka bjp, Yediyurappa

    తదుపరి వార్తలు