2023లో దేశ రాజకీయాలు వేడెక్కనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల (2024 Loksabha elections) కంటే ముందు..ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ (Telangana)తో పాటు కర్నాటక (Karnataka), రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Praesh), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), త్రిపుర (Tripura), మేఘాలయా (Meghalaya), నాగాలాండ్ (Nagaland), మిజోరాం (Mizoram)లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబరులో మిజోరం ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. 2024 మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో.. ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.
Amit Shah: ఆపరేషన్ కర్ణాటక.. క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. అలా ముందుకు
ఈ ఏడాదిలో మొదట త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందులో త్రిపురపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే.. 2018 ఎన్నికల్లో తొలిసారి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షం నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) అధికారంలో ఉంది. మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధికారంలో ఉంది. ఇది కూడా బీజేపీ మిత్రపక్షమే. ఈ రెండు రాష్ట్రాల్లో తమ మిత్రపక్ష పార్టీల కంటే.. బీజేపీ చిన్న పార్టీగా ఉంది. ఇక కర్నాటకలో మాత్రం బీజేపీ బలంగా ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. 2018లో కర్నాటక రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. మొదట బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం.. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అధికారంలోకి రావడం.. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.. మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడంతో.. కన్నడ రాజకీయాలు ఆసక్తి రేకించాయి.
Congress: పాదయాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్‌ని మార్చేస్తుందా ? 2024కి కాంగ్రెస్ రోడ్ మ్యాప్ ఏంటి ?
ఇక రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. కానీ రాజస్థాన్‌లో మాత్రం పరిస్థితులు ఆశాజనంగా లేవు. సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. సచిన్ పైలట్ వర్గం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉంది. అశోక్ గహ్లోత్ వర్సెస్ సచిన్ పైలట్ వ్యవహారం.. కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం మారుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి తామే గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌ను ఓడించి.. అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. నవంబరులో మిజోరంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అధికారంలో ఉంది.
Omicron XBB.1.5 variant : భారత్‌లో కొత్త వేరియంట్.. తొలి కేసు నమోదు
ఈసారి తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే పోటీ జరగ్గా..ఈసారి మాత్రం త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గతంలో పోల్చితే.. బీజేపీ బలపడడంతో... ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా ఉండనున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ .. ముచ్చటగా మూడోసారి కూడా తామే అధికారంలోకి వచ్చేందుకు...వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. కానీ ఈసారి బీఆర్ఎస్‌కు ప్రజలు ఖచ్చితంగా షాకిస్తారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కమలం నేతలు కూడా ఢంకా బజాయిస్తున్నారు.
ఈ తొమ్మిది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా ఎన్నికలు జరిగితే.. మొత్తం 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసారి ఎన్నికలు జరిగినట్లవుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీలకే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయావకాశాలు ఉంటాయని ఆయా పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అందువల్ల 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elections