• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SEEMA DHAKA DELHI POLICE OFFICER TRACED 76 MISSING CHILDREN WITHIN A PERIOD OF 12 MONTHS BA GH

లేడీ ‘సింగం’.. మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు అరుదైన ‘ప్రమోషన్’ 

లేడీ ‘సింగం’.. మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు అరుదైన ‘ప్రమోషన్’ 

Seema Dhaka: సీమా ఢాకా (File)

ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సీమా ఢాకా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

  • Share this:
పోలీసులు అనగానే మనకు ఠకీమని ఎన్నో మంచి చెడ్డ విషయాలు గుర్తుకువస్తాయి. ఇవన్నీ పక్కనపెడితే 'సింగం' లాంటి ఎంతో మంది సమర్థవంతమైన పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు మనదేశంలో ఉన్నారు. అలాంటి కోవకు చెందిన మహిళా పోలీస్ ఆఫీసరే ఒకరు న్యూఢిల్లీలో పనిచేస్తున్న సీమా ఢాకా.

హెడ్ కానిస్టేబుల్ నుంచి..
ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సీమా ఢాకా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తన దీక్షాపాఠవాలతో సీమా ఏకంగా పదుల సంఖ్యలో చిన్నారులను రక్షించి, వారి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 76 మంది చిన్నారులను కాపాడి ఈమె అరుదైన ప్రమోషన్ సొంతం చేసున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఔట్ స్కర్ట్స్ లో ఉన్న సమయ్పూర్ బాద్లీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

అసాధారణ్ కార్య పురస్కార్
విధి నిర్వహణలో చూపిన అంకిత భావానికి ఈమెకు ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున అందాయి. 'అసాధారణ్ కార్య పురస్కార్' ను కూడా ఈమె అందుకున్నారు. ఇలా సీమా ద్వారా మళ్లీ తమ తల్లిదండ్రులు చేరిన వారిలో 14 ఏళ్లలోపున్న బాలలు 76 మందికాగా అందులో 8 ఏళ్లకంటే లోపున్న 15 మంది చిన్నారులు కూడా ఉండటం విశేషం. కేవలం రెండున్నర నెలల కాలంలో సీమా ఈ ఘనత సాధించడం హైలైట్. ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన సీమా చర్యలతో పలు కుటుంబాల్లో సంతోషం నింపుతోంది. కేవలం ఢిల్లీ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో తప్పిపోయిన బాలలను కూడా ఈమె రక్షించారు. ఇలా తాను కాపాడిన వారిలో ఇద్దరు పిల్లలు పశ్చిమ బెంగాల్, పంజాబ్ లోని హోషియార్ పూర్ నుంచి ఇద్దరు పిల్లలను, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బీహార్ వంటి ప్రాంతాల్లో తప్పిపోయిన బాలబాలికలను కూడా ఈమె కాపాడి, తల్లిదండ్రులకు అప్పగించడం హైలైట్.

హృదయ విదారక గాథలు కూడా..
ఇలా సీమా ఢాకా కాపాడిన కొందరు చిన్నారుల కథలు హృదయవిదారకంగా ఉన్నాయి. 2018లో ఓ మహిళ తన కుమారుడు తప్పిపోయాడని కంప్లైంట్ చేసింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీమా ఎట్టకేలకు రెండేళ్ల తరువాత అంటే 2020లో పిల్లాడి ఆచూకిని కనిపెట్టారు. కానీ పిల్లాడు దొరికాడన్న సమాచారం ఇద్దామంటే ఫిర్యాదు ఇచ్చిన తల్లి ఫోన్ నంబర్, చిరునామా మారిపోయాయి. అయినా పట్టువదలని సీమా ఆ తల్లి వివరాలు సంపాదించి, బాలుడిని అప్పగించడానికి వెళ్తే, ఆమె అప్పటికే రెండో వివాహం చేసుకుని ఉన్నట్టు తెలిసింది. అయితే బాబు మాత్రం తల్లి దండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించలేదు. పినతండ్రి సరిగ్గా చూసుకోక పోగా రోజూ కొడుతున్నాడనే కారణంతో ఈ బాలుడు ఇంటి నుంచి పారిపోగా, తప్పిపోయినట్టు తల్లి ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది. ఈ విషయం అంతా తమకు రెండేళ్ల తరువాతగానీ తెలియదు. ఎంతో సాహసం చేసి, ఆఖరుకి 2 నదులను కూడా దాటి వచ్చి, బాబు ఆచూకి కనిపెట్టాక చివరికి తెలిసిందంటూ సీమా చెప్పుకొచ్చారు. 2006లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరిన సీమా ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొనడం విశేషం.

హైదరాబాద్ లోనూ..
మనదేశంలో నిత్యం పదుల సంఖ్యలో చిన్నారులు తప్పిపోతున్నారు. కొన్ని మాఫియా ముఠాలు పిల్లలను ఎత్తుకుని వెళ్లి, దేశ విదేశాల్లో అమ్మేస్తుండగా, మరికొందరు చిన్నారులు దారి తప్పి శాశ్వతంగా తల్లిదండ్రులకు దూరమైపోతున్నారు. తమ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారులు ఇలా తప్పిపోవడంతో తల్లిదండ్రులు షాక్ లో ఉంటూ, తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. బిచ్చగాళ్ల ముఠాలు చాలా ఎక్కువగా ఉన్న మనదేశంలో చిన్నారులను అపహరించి వారితో భిక్షాటన చేయించే కుంభకోణాలకు పాల్పడుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదుకాని పోలీస్ స్టేషన్ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే సీమా ఢాకా లాంటి సూపర్ కాప్ (super cop) రాష్ట్రానికి ఒకరుంటే సూపర్ గా ఉంటుంది కదూ.
Published by:Ashok Kumar Bonepalli
First published: