దేశంలో విచ్చలవిడిగా నమోదవుతోన్న రాజద్రోహం (దేశద్రోహం) కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో సాగుతోన్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై పునరాలోచన చేస్తామన్న కేంద్రానికి సుప్రీం 24 గంటల గడువు ఇచ్చింది. పూర్తి వివరాలివే..
దేశంలో విచ్చలవిడిగా నమోదవుతోన్న రాజద్రోహం (దేశద్రోహం) Sedition Law కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో సాగుతోన్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124ఏ (Section 124A of IPC) యథేచ్ఛగా దుర్వినియోగమవుతోందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో దీనిపై పునరాలోచన చేస్తామన్న కేంద్రానికి సుప్రీం 24 గంటల గడువు ఇచ్చింది. ఈ వివాదాస్పద సెక్షన్ను సమీక్షిస్తామని స్వయంగా ప్రభుత్వమే ప్రతిపాదించిన క్రమంలో త్వరగా తేల్చేసేలా కేంద్రంపై కోర్టు ఒత్తిడి పెంచింది.
దేశ ద్రోహం చట్టాన్ని పున:సమీక్షిస్తామని కేంద్రం చెప్పిన దరిమిలా ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోందా? లేదా? తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది.
CM KCR | Centre: కేసీఆర్ సర్కారుకు భారీ షాక్.. అప్పులు నిలిపేసిన కేంద్రం.. సంక్షేమ పథకాలకు దెబ్బ!
ఐపీసీ సెక్షన్ 124ఏపై సమీక్ష పూర్తయ్యే వరకు ప్రస్తుతం విచారణలో ఉన్న రాజద్రోహం కేసుల విషయంలో ఎలా వ్యవహరించాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెప్పదల్చుకున్న అంశాలను బుధవారం నాటికి తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేంత వరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేందుకు ఎంత కాలం పడుతుందని, దీని దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తున్నామని చెప్తూ, ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించవద్దని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.
నిజానికి మోదీ సర్కారు తన ప్రత్యర్థులపై విచ్చలవిడిగా దేశద్రోహం కేసులు పెట్టడం, ఇప్పుడు బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ రాజకీయ కక్షసాధింపు చర్యలకు రాజద్రోహం చట్టాన్ని ఆయా ప్రభుత్వాలు అతిగా వాడుకుంటోన్న క్రమంలోనే తాజా పరిణామం తలెత్తింది. రాజద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకుంటూ, ఐపీసీలోని 124ఏ సెక్షన్ను కొనసాగించడంపై పునరాలోచించాలని నిర్ణయించడం, ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడం తెలిసిందే.
ఐపీసీ సెక్షన్ 124ఏపై పునఃపరిశీలన ప్రక్రియను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలని, అప్పటి వరకు ఈ సెక్షన్ ప్రకారం దాఖలైన కేసుల్లో తదుపరి చర్యలను చేపట్టకుండా తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని సలహా ఇచ్చింది. తాజాగా మహారాష్ట్రఅమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు, చాలా కాలం కిందట ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తదితరులపై ప్రభుత్వాలు రాజద్రోహం కేసులు పెట్టడం తెలిసిందే. కేంద్రం తన అఫిడవిట్ లోనూ ఈ అంశాలను ప్రస్తావించింది. మొత్తంగా సర్కారు ఉద్దేశం ఏదైనా వివాదాస్పద చట్టం త్వరలోనే తెరమరుగుకానుంటం ఊరటకలిగించే అంశం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.