SCUFFLE BETWEEN MAHARASHTRA KARNATAKA BODIES TRIGGERS TENSIONS AT BORDER CITY OF BELGAUM BA GH
Belgaum Controversy: కర్ణాటక- మహారాష్ట్ర మధ్య మళ్లీ బెల్గాం చిచ్చు.. ఇరు రాష్ట్రాల్లో నిరసనలు
కర్ణాటక పోలీసులు (File)
Belgaum Border Issue | మహారాష్ట్ర అనుకూల సంస్థ అయిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) బెల్గాంను తమ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎంఈఎస్ నాయకుడి ముఖంపై కొందరు కన్నడ సంఘాల సభ్యులు ఇంకు పూశారు. దీంతో హత్యాయత్నం ఆరోపణలపై 12 మంది కన్నడ అనుకూల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
బెలగావి (Belagavi) లేదా బెల్గాం (Belgaum).. కర్ణాటక (Karnataka) - మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నగరం. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు కు (Supreme Court) చేరింది. 50 సంవత్సరాల క్రితం జస్టిస్ ఎంసీ మహాజన్ నేతృత్వంలోని కమిషన్ ఈ నగరాన్ని కర్ణాటకలో అంతర్భాగమని తీర్పునిచ్చినప్పటికీ మహారాష్ట్ర ఇప్పటికీ ఈ నగరం కోసం పోరాడుతూనే ఉంది. అయితే వారం రోజుల ఈ సమస్య క్రితం మొదలైంది. మహారాష్ట్ర అనుకూల సంస్థ అయిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్) బెల్గాంను తమ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎంఈఎస్ నాయకుడి ముఖంపై కొందరు కన్నడ సంఘాల (Kannada Associations protest) సభ్యులు ఇంకు పూశారు. దీంతో హత్యాయత్నం ఆరోపణలపై 12 మంది కన్నడ అనుకూల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ చర్యను కర్ణాటక ప్రజలు ఖండించారు.
కొల్హాపూర్‌లో కన్నడ జెండాకు నిప్పు
ఈ ఘటన జరిగిన ఓ రోజు తర్వాత కొన్ని మరాఠా సంస్థలు మహారాష్ట్రలోని కొల్హాపూర్ (Kolhapur) లో కన్నడ జెండాను తగులబెట్టారు. ఈ చర్యను కర్ణాటక ప్రభుత్వంతో పాటు అన్ని కన్నడ సంస్థలు ఖండించాయి. ఇందుకు బదులు కొందరు కన్నడ కార్యకర్తలు బెంగళూరులోని శివాజీ విగ్రహాన్ని ధ్వంసం (Shivaji Idol Attacked) చేసేందుకు ప్రయత్నించారు. ప్రతీకారంగా ఎంఈఎంస్ కార్యకర్తలు భారతదేశపు మొదటి స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరు, బెల్గాం అమరవీరుడు సంగోలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సంగోలి రాయన్నను కర్ణాటక కల్చరల్ ఐకాన్‌గా భావిస్తారు. దీంతో ఎంఈఎస్‌ను నిషేధించాలని, మహారాష్ట్రలో కన్నడ జెండాను దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కన్నడ సంఘాలు ఆందోళన ప్రదర్శనలు చేపట్టారు.
కన్నడ కార్యకర్తలను శాంతింపజేసేందుకు బొమ్మై ప్రయత్నం
ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ప్రతిస్పందించారు. ఎంఈఎంస్పై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ కన్నడ కార్యకర్తలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన స్పందన అంత అర్థవంతంగా లేదని, చిత్తశుద్ధి కనిపించట్లేదని కన్నడ సంస్థలు భావిస్తుండటం గమనార్హం. బెంగళూరులో శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకించిన వారిలో ఇతర రాజకీయ నాయకులతో పాటు బసవరాజ్ బొమ్మై కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన నుంచి మిశ్రమ గళం వినిపిస్తోంది.
శివాజీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని ఖండించిన ఉద్ధవ్ ఠాక్రే
ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. అయితే సంగొల్లి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఉద్ధవ్ వ్యతిరేకించకపోవడం కన్నడవాదులకు ఆగ్రహం తెప్పించింది. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్‌వారి ఉరితీతకు అసువులు బాసిన రాయన్నను గౌరవించకుండా కన్నడిగుల మనోభావాలను ఠాక్రే దెబ్బతీశారని మండిపడ్డారు.
మహారాష్ట్రకు అనుకూలంగా బొమ్మై ప్రభుత్వం: కన్నడ సంఘం ఆరోపణ
రాష్ట్రంలోని అత్యంత శక్తిమంతమైన కన్నడ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షులు నారాయణ గౌడ ఈ విషయంపై స్పందించారు. ప్రభుత్వ తేలికపాటి ప్రతిస్పందనను విమర్శించారు. ఎంఈఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా కన్నడ ఉద్యమకారులను బొమ్మై ప్రభుత్వం జైలుకు పంపుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్రకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎంఈఎస్తో భాజపా కలవడాన్ని కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించారు. అయితే హెచ్‌డీకే ఆరోపణలను తిప్పికొట్టారు ఆ రాష్ట్ర మరో మాజీ సీఎం యడియూరప్ప. ఆయనవి మూర్ఖత్వపు ఆలోచనలని దుయ్యబట్టారు. బెల్గాంలో ఆందోళనకు దిగిన ఎంఈఎస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పరిస్థితులు ఇలా ఉండగా.. ఈ పరిణామాలు ఇరురాష్ట్రాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. మహారాష్ట్రలో కర్ణాటక ప్రభుత్వం నడుపుతున్న బస్సులపై రాళ్లు రువ్విన సంఘటనలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడి కన్నడిగుల ఆస్తులకు రక్షణ కల్పించాలని కర్ణాటక డీజీపీని సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేయడంతో పాటు తమ ప్రభుత్వం ఎంఈఎస్పై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కర్ణాటక సంస్థలు మాత్రం అంత సులభంగా నమ్మడం లేదు. భాజపా ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని, ఎంఈఎస్పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కర్ణాటక అసెంబ్లీలో ఎంఈఎస్ కొన్ని సీట్లు గెల్చుకోవడం గమనార్హం.
1799లో బ్రిటీష్ వారి చేతిలో టిప్పు సుల్తాన్ పరాజయం పాలైన తర్వాత మైసూరు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను మరాఠాలకు అప్పగించారు. అనంతరం బొంబాయి ప్రావిన్సులో విలీనం చేశారు. 1947 వరకు ఈ ప్రాంతం బ్రిటీష్ అధీనంలోనే ఉంది. అనంతరం 1956లో బెల్గాం కర్ణాటకలో భాగమైంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.