పిల్లలకు సరైన పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్.. తుపాకీ పట్టుకున్నాడు. పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన ఆయనే దారి తప్పాడు. ఉగ్రవాదం ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. బాంబు చేత పట్టుకున్నాడు. అంతేకాదు నలుగురు అమాయాకుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. గతేడాది వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనో టీచర్ అని తెలియడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది.
లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్:
లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న ఆరిఫ్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. గతేడాది మేలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జమ్ములోని నర్వాల్‌లో గత నెల 21న జరిగిన జంట పేలుళ్ల కేసులోనూ ఇతడే అనుమానితుడు.
పెర్ఫ్యూమ్ బాంబ్:
నిందితుడి దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్‌లో ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇక తమ ప్రత్యేక బృందం ఆ ఐఈడీని పరిశీలిస్తుందని... జమ్ముకశ్మీర్‌లోలో ఉన్న ప్రజల మధ్య మతపరమైన విభజన సృష్టించాలని పాకిస్థాన్ కోరుకుంటోందంటూ మండిపడ్డారు జమ్ముకశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్బార్ సింగ్. అటు పాకిస్థాన్ చెప్పినట్లే ఆరిఫ్ పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇండియా-పాక్ బార్డర్ వద్ద అతనికీ ఎవరో ఈ ఐఈడీలు ఇస్తున్నారన్నారు. అది ఖచ్చితంగా పాక్ ఉగ్రవాదుల పనేనని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఇక వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడితో తనకు సంబంధం ఉన్నట్లు ఆరిఫ్ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నలుగురి చనిపోగా.. 24 మంది గాయపడ్డారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో జమ్మూలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో, గత నెల 21న నర్వాల్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఆరిఫ్‌కు సంబంధముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Terrorism