హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వన్యప్రాణులను పెంచుకునే వారికి ఊరట.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

వన్యప్రాణులను పెంచుకునే వారికి ఊరట.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రతీకాత్మక చిత్రం (Image:Twitter)

ప్రతీకాత్మక చిత్రం (Image:Twitter)

వన్య ప్రాణులను పెంచుకుంటున్న వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి చెప్పాలని.. జూన్-డిసెంబరు మధ్య ఆ వివరాలను వెల్లండించిన వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని కేంద్రం ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకొచ్చింది.

  మనలో చాలా మందికి ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం ఇష్టం. ఇంకొందరైతే వణ్య ప్రాణులను కూడా పెంచుకుంటున్నారు. అరుదైన, వన్య ప్రాణులను సొంత పిల్లలా చూసుకుంటున్నారు. కానీ మన దేశంలో ఇది నేరం. ఐనప్పటికీ చాలా మంది ఎవరికీ తెలియకుండా అరుదైన అటవీ జంతువులు, పక్షులను ఇంట్లో పెంచుకుంటున్నారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. ఐతే తమ వద్ద ఉన్న వన్య ప్రాణులు, విదేశీ జంతు జాతుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడిస్తే వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకుండా చూసుకుంటామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలో అలహాబాద్ కోర్టులో పిల్ దాఖలైంది.

  అలహాబాద్ కోర్టు మాత్రం కేంద్ర నిర్ణయాన్ని సమర్థించింది. తాము పెంచుకుంటున్న వన్య ప్రాణుల వివరాలను వెల్లడించిన వారిపై ఎలాంటి విచారణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఐతే జూలైలో ఇచ్చిన అలహాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై శనివారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అలహాబాద్ కోర్టు తీర్పును స్వాగతించింది. జూన్ నుంచి డిసెంబర్ మధ్య.. పెంపుడు వన్య ప్రాణుల వివరాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా వెల్లడించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్‌.ఏ.బాబ్డే, జస్టిస్ ఏ.ఎస్. బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.

  ఇంట్లో వన్య ప్రాణులు, విదేశీ జంతు జాతులను పెంచుకుంటున్న వారు.. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి చెప్పాలని, జూన్-డిసెంబరు మధ్య ఆ వివరాలను వెల్లండించిన వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని కేంద్రం ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకొచ్చింది. మన దేశంలో ప్రజలు పెంచుకుంటున్న వన్య ప్రాణుల వివరాలతో రాష్ట్రం, కేంద్ర స్థాయిలో డేటా బేస్‌ను సిద్ధం చేయనుంది ప్రభుత్వం. తద్వారా విదేశాల నుంచి అరుదైన జంతు జాతులు, వన్య ప్రాణుల దిగుమతిని నియంత్రించడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టనున్నారు. వాటిని నిర్వహణను పర్యవేక్షిస్తూనే.. అమ్మకాలు, కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. అక్రమాలకు పాల్పాడే వారిపై ఉక్కుపాదం మోపనున్నారు.

  ప్రజలు తమ వద్ద ఉన్న అటవీ జంతువులు, పక్షుల వివరాలను వెల్లడించేందుకు డిసెంబరు 2020 వరకు గడువు విధించింది కేంద్రం. ఆ లోగా స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. DRI అధికారులు కూడా జోక్యం చేసుకోరు. కానీ ప్రభుత్వానికి చెప్పకుండా రహస్యంగా జంతువులు, పక్షులను పెంచుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో.. ఇక నుంచి ఇంట్లో పెంచుకునే వన్యప్రాణుల వివరాల నమోదును కేంద్ర వాతావరణ, అటవీశాఖ వేగవంతం చేయనుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Supreme Court

  ఉత్తమ కథలు