హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lakhimpur violence : యూపీ సర్కారుపై నమ్మకం లేదన్న సుప్రీంకోర్టు -కేంద్ర మంత్రి కొడుకును తప్పించేలా..

Lakhimpur violence : యూపీ సర్కారుపై నమ్మకం లేదన్న సుప్రీంకోర్టు -కేంద్ర మంత్రి కొడుకును తప్పించేలా..

లఖీంపూర్ కేసుపై సుప్రీం విచారణ(photo credit livelaw)

లఖీంపూర్ కేసుపై సుప్రీం విచారణ(photo credit livelaw)

లఖీంపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. రైతులపై హింసాకాండ కేసులో యూపీ సర్కారును నమ్మబోమన్న కోర్టు.. మాజీ హైకోర్టు జడ్జిల నేతృత్వంలో దర్యాప్తు జరిపించేందుకు సిద్దమైంది.

ఇంకా చదవండి ...

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతుల్ని జీపుతో తొక్కించి చంపిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నిస్తోన్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. లఖీంపూర్ ఖేరీ హింస కేసులో ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదన్న కోర్టు.. మాజీ హైకోర్టు జడ్జిల నేతృత్వంలో దర్యాప్తు జరిపించేందుకు సిద్దమైంది. రైతులపై హింసాకాండ కేసును విచారిస్తూ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసంన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ లో అక్టోబర్ మొదటివారంలో హింసాకండ జరగ్గా సీజేఐ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ సదరు ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సిందిగా గత విచారణలో యూపీ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశిచింది. రిపోర్టు సమర్పణకు 10 రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే, యూపీ సర్కారు సమర్పించిన స్టేటస్ రిపోర్టుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘10 రోజులు గడువిచ్చిన తర్వాత కూడా సాక్ష్యుల్ని విచారించాం అనే మాట తప్ప రిపోర్టులో పెద్దగా ఏమీ లేదు. అరెస్టులపై వివరాలు ఇవ్వలేదు. ల్యాబ్ రిపోర్టులనూ పొందుపర్చలేదు. రెండు ఎఫ్ఐఆర్ లను కలిపేసి నిందితుడికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నట్లుగా మాకు అనిపిస్తోంది’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

లఖీంపూర్ ఘటనలో రైతులను కారుతో తొక్కి చంపడంపై ఒక ఎఫ్ఐఆర్, బీజేపీ కార్యకర్తలు, జర్నలిస్టును రైతులు కొట్టి చంపిన ఉదంతంపై మరో ఎఫ్ఐఆర్ నమోదుకాగా, ఈ రెండిటినీ కలిపేసి, నిందితుడైన కేంద్రమంత్రి కొడుకుకు అనుకూలంగా కేసును తిప్పేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఆలోగా జడ్జిల ఆధ్వర్యంలో దర్యాప్తు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది.

లఖీంపూర్ ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ కోసం పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రంజిత్ సింగ్, రాకేశ్‌ కుమార్ జైన్‌ల పేర్లను సుప్రీంకోర్టు సూచించింది. లఖీంపూర్ హింస ఘటనలో సాక్ష్యాలు కలిసిపోకుండా, రెండు ఎఫ్ఐఆర్ లను వేర్వేరుగా చూస్తూ తదుపరి దర్యాప్తు సాగించే ఉద్దేశం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిషన్ కు లేనట్లుగానే తోస్తున్నదని, కాబట్టే కేసు దర్యాప్తు పర్యవేక్షణను మాజీ జడ్జిల చేత చేయించాలనుకున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. అదేసమయంలో నిందితుల ఫోన్‌ కాల్‌ వివరాలు ఇవ్వాలని, పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

Published by:Madhu Kota
First published:

Tags: Farmers Protest, Supreme Court, Uttar pradesh

ఉత్తమ కథలు