హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pegasus: మోదీ సర్కారుకు భారీ షాక్ -పెగాసస్ నిఘా కుట్రపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం -సీజేఐ రమణ బెంచ్ ఆదేశాలివే..

Pegasus: మోదీ సర్కారుకు భారీ షాక్ -పెగాసస్ నిఘా కుట్రపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం -సీజేఐ రమణ బెంచ్ ఆదేశాలివే..

పెగాసస్ పై సుప్రీంకోర్టు

పెగాసస్ పై సుప్రీంకోర్టు

దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన పెగాసస్ నిఘా కుట్ర ఉదంతంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్రం గట్టిగా వాదించినా, ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే దిశగా సుప్రీంకోర్టు నిపుణుల దర్యాప్తు కమిటీని నియమించింది..

ఇంకా చదవండి ...

సంచలనం రేపిన పెగాసస్ నిఘా కుట్ర వివాదంలో కేంద్రంలోని మోదీ సర్కారుకు భారీ షాక్ తగిలింది. ఉగ్రవాదులపై నిఘా కోసం ఉద్దేశించిన స్పైవేర్ ను ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలపై వాడిందనే ఆరోపణల నడుమ సదరు వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. పెగాసస్ స్పైవేర్ ను ఇతరులపై వాడలేదని, ఒకవేళ వాడినా దేశ భద్రతతో ముడిపడిన అంశం కాబట్టి ఆ వివరాలు వెల్లడించలేమని కేంద్రం గట్టిగా వాదించినా దర్యాప్తునకే సుప్రీంకోర్టు మొగ్గుచూపడం గమనార్హం. పెగాసస్ ఉదంతంపై బుధవారం నాటి విచారణలో సీజేఐ ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం సంచలన ఆదేశాలు ఇవ్వడంతోపాటు అనూహ్య వ్యాఖ్యలు చేసింది.

పెగాసస్ నిఘా కుట్రపై సుప్రీంకోర్టు స్వయంగా ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని ప్రకటించింది. సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జీ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ వేస్తున్నామని, ఆ కమిటీలో జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌, అలోక్‌ జోషీ, సందీప్‌ ఒబరాయ్‌ లు సభ్యులుగా ఉంటారని, ప్రొఫెసర్ నవీన్ కుమార్, ప్రొఫెసర్ ప్రభాకరన్, ప్రొఫెసర్ అశ్విన్ అనిల్ గుమాస్తేలు టెక్నికల్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కమిటీ మొత్తం ఏడు అంశాలపై దర్యాప్తు చేస్తుందని సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది.

పెగాసస్‌ నిఘా ఉదంతంపై తామే కమిటీని వేసి దర్యాప్తు చేపడతామన్న కేంద్రం ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మనం సమాచార యుగంలో జీవిస్తున్నాం. సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తిస్తున్నాం. అదే సమయంలో గోప్యత హక్కును కాపాడుకోవడం కూడా ముఖ్యమైనదే..’అని సీజేఐ అన్నారు. పెగాసస్‌ ఉదంతంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ.. పిటిషనర్లు లేవనెత్తతిన అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తుందని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది.

ప్రపంచ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది పెగాసస్ నిఘా కుట్ర వ్యవహారం. ఇజ్రాయెల్ కు చెందిన ప్రైవేటు రక్షణ సంస్థ ఎన్ఎస్ఓ రూపొందిన స్పైవేర్ ‘పెగాసస్’ను పలు దేశాల ప్రభుత్వాలు తప్పుడు పనులకు వాడుకున్నాయనే వివాదం రచ్చకు దారితీయడం తెలిసిందే. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం తయారైన పెగాసస్ స్పైవేర్ ను ఆయా ప్రభుత్వాలు.. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలపై ప్రయోగించారనే ఆరోపణలు అన్ని దేశాల్లో వచ్చాయి. వివాదాల నేపథ్యంలో పెగాసస్ ఆ మధ్య కీలక ప్రకటన చేసింది. టెర్రరిజం కట్టడికి మాత్రమే తామీ నిఘా వ్యవస్థను రూపొందించామని, కేవలం ప్రభుత్వాలతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఒకవేళ ప్రభుత్వాలే పెగాసస్ ను దుర్వినియోగం చేస్తే ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పింది. దుబాయ్ రాజు తన మాజీ భార్యపై పెగాసస్ నిఘా ఉంచినట్లు తేలడంతో యూఏఈతో ఎన్ఎస్ఓ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

Published by:Madhu Kota
First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు