SBI REVOKES DISCRIMINATORY RECRUITMENT RULES FOR PREGNANT WOMAN CANDIDATES PVN
SBI : వెనక్కి తగ్గిన ఎస్బీఐ..వాళ్లు కూడా అర్హులే..DWC నోటీసుతో ఆ రూల్స్ మార్పు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ప్రతీకాత్మక చిత్రం)
pregnant woman in SBI : సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో గర్భవతులైన అభ్యర్థులకు సంబంధించి అమల్లోకి తెచ్చిన నిబంధనలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్బీఐ ఇవాళ ప్రకటించింది.
SBI rule for pregnant woman : గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)ఇటీవల మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ఎస్బీఐ తాజా ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్(DWC) తీవ్రంగా స్పందించింది. ఇది మహిళ పట్ల వివక్షచూపడమేకాకుండా చట్టవిరుద్ధమని, ఈ మహిళా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. అసలు ఈ నిబంధనలను ఎలా రూపొందించారు? దీని వెనుక అధికారులు ఎవరు వున్నారు? అనేదానిపై వచ్చే మంగళవారంలోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐని మహిళా కమిషన్ కోరింది.
ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు 'వారిని తాత్కాలిక అన్ ఫిట్' అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం కల్పించిన మెటర్నిటీ ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరుతూ నోటీసు జారీ చేశాం" అని స్వాతి ట్వీట్ లో తెలిపారు.
కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబరు 31నాటి ఎస్బీఐ సర్క్యులర్ లో.... మూడు నెలల నిండిన గర్భిణీ స్త్రీలను విధిగా ఎంపిక చేసినప్పటికీ ఉద్యోగంలో చేరకుండా నిలిపివేసింది. దీని ప్రకారం నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారు. వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆదేశాలు జారీ చేసింది. నూతన నియామకాలకు ఈ నిబంధన 2021 డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ప్రమోషన్లపై వెళ్లేవారికి 2022 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని ఎస్బీఐ బ్యాంక్ తెలిపింది.
ఎస్బీఐ కొత్త నిబంధనలపై ఆలిండియా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్‌తో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిని గర్భంతో ఉన్నారని చేర్చుకోకపోవడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో గర్భవతులైన అభ్యర్థులకు సంబంధించి అమల్లోకి తెచ్చిన నిబంధనలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్బీఐ ఇవాళ ప్రకటించింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.