కరోనా కల్లోలానికి అడ్డుకట్ట పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వేక్సిన్ ను ప్రజలకు అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. మన దేశంలో కూడా కరోనా టీకా సరఫరా ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. అన్ని రాష్ట్రాలకు కరోనా టీకా సరఫరా జరుగుతోంది. మొదటి విడతగా వృద్ధులతోపాటు వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, వంటి అత్యవసర సేవల సిబ్బందికి అందించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. అదే సమయంలో కరోనా టీకా కోసం ఎగబడవద్దని రాజకీయ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే సూచనలు చేశారు. ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనాతో పోరాడిన అత్యవసర సేవల సిబ్బందికి టీకా ఇవ్వాలనీ, వారి సేవలు దేశానికి అవసరమని మోదీ సూచించారు.
2021వ సంవత్సరం ఆగస్టు నెలాఖరు లోపు దాదాపు 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అదే సమయంలో 2022వ సంవత్సరం చివరి కల్లా ఏకంగా మరో 50 కోట్ల మందికి కరోనా టీకాను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అసలు ఈ వేక్సిన్ ను ప్రజలకు ఇచ్చేందుకు ఎంత ఖర్చవుతుంది..? అన్న అంచనాలను ఎస్బీఐ ఓ పరిశోధనలో తేల్చింది. ఈ పరిశోధనలో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ‘మొదటి విడదలో దాదాపు 30 కోట్ల మందికి కరోనా టీకా అందించనున్నారు. దీనికి 21 వేల కోట్ల నుంచి 27 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. రెండో విడతలో మరో 50 కోట్ల మందికి టీకాను ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికి మరో 35 వేల నుంచి 45 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇది దేశ జీడీపీలో 0.3 నుంచి 0.4శాతంగా ఉంటుంది‘ అని ఎస్బీఐ చేసిన ఓ పరిశోధనలో తేలింది. మొత్తానికి భారత్ లో 80 కోట్ల మంది ప్రజలకు కరోనా టీకా అందించడానికి 56వేల కోట్ల రూపాయల నుంచి 72 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ తన పరిశోధనలో వెల్లడించింది.
ఒక్కో డోసుకు 100 రూపాయల నుంచి 150 రూపాయలు, ఒక్కో వ్యక్తికి ఒక్కో డోస్ ఇవ్వడానికి అంతిమంగా 250 నుంచి 300 రూపాయలు వరకు ఖర్చవుతుందని ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆ సంస్థ నుంచి వచ్చిన ’కోవిషీల్డ్‘ను అత్యవసర వాడుకకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ లెక్కలను బట్టి ఒక్కో వ్యక్తి కరోనా టీకాను తీసుకునేందుకు 700 నుంచి 900 రూపాయల ఖర్చయ్యే అవకాశం ఉందని తేల్చింది. అయితే అదే సమయంలో భారత్ బయెటెక్ తయారుచేసిన కరోనా టీకాకు కూడా అనుమతి లభించింది. ఈ టీకా ఒక్కో డోసు ఇవ్వడానికి వంద రూపాయల కంటే తక్కువే ఖర్చవుతుందని స్పష్టం చేసింది.
Published by:Hasaan Kandula
First published:January 12, 2021, 13:33 IST