అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్ణాటకలోని పరప్పణ అగ్రహాన జైల్లో అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది.. అక్కడ చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా టెస్టులు చేయగా, ఆ రిపోర్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. జైల్లో ఉన్నప్పుడే ఆమెకు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్లు ఆమెను పరిశీలిస్తున్నారని టీటీవీ దినకరన్ చెప్పారు. ఆమె ఆరోగ్యాన్ని వైద్యులు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెకు ఆక్సిజన్ అవసరం అవుతోందని తెలిపారు.
శశికళ ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు సాయంత్రం 5 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమెను బౌరింగ్ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని, శశికళ టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడిజం, యూటీఐతో బాధపడుతున్నారని చెప్పారు. ఆమెకు యాంటీబయోటిక్స్ ఇస్తున్నామన్నారు. ఆమె ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని గుర్తించారు. అది కొంచెం తీవ్రంగానే ఉన్నట్టు సీటీ స్కాన్‌లో తేలింది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శశికళ రాజకీయాలు మొదలు పెడతారని, ఎన్నికల్లో ఎలాంటి సమీకరణాలు ఎదురవుతాయో అని ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది. అయితే, అనూహ్యంగా ఆమె రిలీజ్ కావడానికి వారం రోజుల ముందు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రకారం మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండకప్పకపోవచ్చు. అంటే, జనవరి 27వ తేదీ నాటికి ఆమె నేరుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, అలాగే, జైలు నుంచి కూడా రిలీజ్ అవ్వొచ్చని ఆమె అభిమానులు అంచనా వేస్తున్నారు.