చెన్నై: జయలలిత జయంతి సాక్షిగా తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది. టి.నగర్ పోయెస్ గార్డెన్‌ను తలపించింది. జయలలితకు నివాళులు అర్పించేందుకు శశికళ నివాసానికి పలువురు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. దర్శకుడు భారతీ రాజా, నటులు రాధికాశరత్ కుమార్ శశికళ నివాసానికి వెళ్లారు. మొత్తం మీద.. జయలలిత తర్వాత అన్నాడీఎంకేలో ఆ స్థానం తనదేనన్న సంకేతాలకు శశికళ కేడర్‌కు పంపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే దివంగత నేత జయలలిత జయంతి రోజున ఆమెకు నివాళులర్పించిన సందర్భంగా ఆమె ఆప్తురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే నుంచి ఆమెను బహిష్కరించినట్లు ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్నప్పటికీ జయలలిత తర్వాత అన్నాడీఎంకే వారసత్వం తనకే సొంతం కావాలన్న లక్ష్యంతో శశికళ ఉన్నారని ఆమె తాజా వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. టి.నగర్‌లో శశికళ నివాసం వెలుపల ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ... ‘అమ్మ నిజమైన కేడర్ ఏకం కావాలి.. అందరూ అన్నాడీఎంకే కోసం సమష్టిగా పనిచేయాలి’ అని శశికళ పిలుపునిచ్చారు.
జయలలిత మద్దతుదారులు, అభిమానులంతా సమష్టిగా ముందుకొచ్చి ఆమె కోరుకున్నట్టుగా అన్నాడీఎంకే 100 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పనిచేయడమే మన ముందున్న లక్ష్యమని ఆమె చెప్పారు. అందుకోసం అన్నాడీఎంకేతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కలిసి పనిచేస్తుందని శశికళ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు రాగానే అన్నాడీఎంకే నుంచి తన వర్గం వైపు భారీగా వలసలు ఉంటాయని ఆమె ఆశించారు. కానీ.. ఆ పరిస్థితి లేకపోవడంతో శశికళ నిరాశ చెందారు. అన్నాడీఎంకేలో అడుగడుగునా తనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని తెలుసుకున్న శశికళ విరక్తితో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకులను కూడా కలుసుకోకుండా పార్టీ వ్యవహారాలకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇక అన్నాడీఎంకే నేతలతో కయ్యం కంటే సంధే మేలని భావించిన శశికళ తాజాగా కలిసి వెళ్దామన్న సంకేతాలను అన్నాడీఎంకే కీలక నేతలకు పంపారు. అయితే.. శశికళను ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరించామని చెబుతున్న నేతలు ఆమె అభ్యర్థనను ఏమేరకు ఆహ్వానిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే... ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో కేడర్ ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని తాను నమ్ముతున్నానని, దీన్ని మీరు సాధ్యం చేయగలరని ఆమె ఆకాంక్షించారు. త్వరలో ప్రజలను, కేడర్‌ను కలుసుకుంటానని శశికళ చెప్పారు. మొత్తంగా శశికళ తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అన్నాడీఎంకే అధిష్టానం జయలలిత తర్వాత తానేనని ఆమె బలంగా నమ్ముతున్నారు. కార్యకర్తల్లోకి కూడా ఈ సంకేతాలనే పంపే ప్రయత్నం చేస్తున్నారు.
శశికళ బెంగళూరులో తన కారులో వెళుతుండగా.. కారుపై అన్నాడీఎంకే జెండాను వినియోగించడాన్నే తప్పుబట్టిన అన్నాడీఎంకే మంత్రులు, ముఖ్య నేతలు తాజాగా శశికళ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్న ఆసక్తి తమిళ రాజకీయాల్లో నెలకొంది. శశికళ బెంగళూరు నుంచి తమిళనాడుకు వెళ్లిన సందర్భంలో 23 గంటల పాటు రోడ్ షో నిర్వహించి అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. జయలలిత జయంతి రోజున శశికళతో రాధికాశరత్ కుమార్ దంపతులు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. రాజకీయపరమైన చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే.. ఆమెతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాధికాశరత్ కుమార్ శశికళ అనారోగ్యానికి గురి కావడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందని యోగక్షేమాలు కనుక్కునేందుకే కలిశామని చెప్పారు.
సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) అనే పార్టీని శరత్‌కుమార్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా రాధిక వ్యవహరిస్తున్నారు. 2011 నుంచి ఎస్‌ఎంకే పార్టీ అన్నాడీఎంకేతో కలిసి నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలిసే పోటీకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. అన్నాడీఎంకే అధిష్టానం శశికళగా భావించిన రాధికాశరత్ కుమార్ ఆమెకు సంఘీభావం తెలిపేందుకే శశికళతో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIADMK, Jayalalithaa, Sasikala, Tamilnadu