ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నెట్‌వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ సంయుక్త సహకారంలో భాగంగా ప్రారంభించి సంజీవని - ఎ షాట్ ఆఫ్ లైఫ్ అవగాహనా కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ ‘సంజీవని కీ గాడీ’ ని ప్రారంభించారు. పంజాబ్‌లోని అటారీ బోర్డర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సోనూసూద్‌తో పాటు ఫెడరల్ బ్యాంక్ సీఈవో శ్యామ్ శ్రీనివాసన్, పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ, అమృత్‌సర్ డీసీ గుర్‌ప్రీత్ సింగ్ ఖైరా పాల్గొన్నారు.
ఈ వాహనం ఊరూరా తిరుగుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించనుంది. వ్యాక్సీన్ తీసుకోవాల్సిన అవసరం గురించి, వ్యాక్సీన్ గురించి ఉన్న అపోహలు, నిజాల గురించి ప్రచారం చేయనుంది. ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వాహనం ‘సంజీవని ఎ షాట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో భాగంగా నెట్‌వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ దత్తత తీసుకున్న 4,831 గ్రామాల్లో ప్రయాణించి అక్కడి ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచనుంది. ఇందులో భాగంగా కరోనా కేసులు అధికంగా ఉన్న అమృత్ సర్, ఇండోర్, నాసిక్, గుంటూరు, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ముందుగా ప్రచారం చేయనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ వాహనాన్ని ప్రారంభించిన తర్వాత కరోనా వ్యాక్సీన్ తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సీన్ తీసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ “గతేడాది చాలామంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎన్నో వేల కిలోమీటర్ల పాటు నడుస్తూ వెళ్లడం నన్ను కలిచివేసింది. కొంతమందిని స్వస్థలాలకు బస్సులు, రైళ్లలో చేర్చగలిగినా.. ప్రతి ఒక్కరూ తాము ఉన్న ప్రదేశాల్లోనే సురక్షితంగా ఉండాలని వారందరికీ పిలుపునిచ్చాం. నా మాటను చాలామంది గౌరవించారు. ఇప్పుడు కరోనాకి వ్యాక్సీన్ వచ్చిన తర్వాత దీన్ని తప్పక తీసుకోవాలని వారందరికీ పిలుపునిస్తున్నాను. వ్యాక్సీన్‌పై ప్రజల్లో ఉన్న సంకోచాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సీన్ వేయించుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్న వారందరికీ నా సూచన ఏంటంటే.. వీలైనంత తొందరగా వ్యాక్సీన్ వేయించుకోండి. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల దేశమే వైరస్‌కి నిరోధకంగా మారిపోతుంది” అన్నారు.
భారత్‌లో మూడో దశ వ్యాక్సీనేషన్ ప్రారంభమైన తర్వాత ఈ సంజీవని కార్యక్రమాన్ని లాంఛ్ చేసి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తోంది నెట్‌వర్క్ 18. ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సీన్‌ని అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. నెమ్మదిగా ఈ వయసును మరింత తగ్గించి అన్ని వయసుల వారికి వ్యాక్సీన్‌ని అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం. దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ బ్యాంక్ సీఎస్ఆర్ డ్రైవ్‌లో భాగంగా కరోనా గురించి కోవిడ్ వ్యాక్సీన్ గురించి గ్రామాల్లో సరైన సమాచారాన్ని అందిస్తూ వారిలోని మూఢ నమ్మకాలను, అపోహలను తొలగించే ప్రయత్నం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ఎన్జీఓలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇన్‌ఫ్లూయెన్సర్ల సహాయంతో సమాచారాన్ని అందిస్తూ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covid-19, News18, Sanjeevani, Sanjeevani- Shot At Life, Sonu Sood