గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుమారు నలభై రోజులకు పైగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో రైతులు గుమిగూడుతుండటం.. ఉత్తర భారతాన చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది. రైతులు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారో.. లేదోనని.. ఒకవేళ పాటించకుంటే గతేడాది ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ ఈవెంట్ మాదిరిగానే ఈ ఉద్యమాలు మారే ప్రమాదం ఉన్నదని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అప్పటిదాక దేశంలో ఓ మోస్తారు స్థాయిలో నమోదవుతున్న కేసులు.. తబ్లిగీ ఈవెంట్ తర్వాత భారీ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. అంతేగాక పలు రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి అంతగా లేకున్నా.. మర్కజ్ ఈవెంట్ తర్వాత ఒక్కసారిగా పెరిగాయి. కాగా, కేంద్రం, రైతుల మధ్య చర్చలలో ప్రతిష్టంభన నెలకొన్ని నేపథ్యంలో సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన దాఖలైన పిటిషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘రైతుల ఆందోళన నుంచి కూడా అదే సమస్య ఉత్పన్నమయేలా కనిపిస్తున్నది. వాళ్లందరూ కోవిడ్-19 నుంచి రక్షణ పొందుతున్నారో లేదో తెలియదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీరు మాకు కచ్చితంగా తెలియజేయాలి..’ అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ మెహతా స్పందిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు’ అని చెప్పినట్టు తెలుస్తున్నది. దీనిపై తాను వివరాలు తెప్పించుకుని కోర్టుకు తెలియజేస్తానని ఆయన తెలిపారు.
గతేడాది మార్చిలో దేశ రాజధానిలో జరిగిన తబ్లిగీ ఈవెంట్ తో దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై దేశంలో ఒక వర్గం నుంచి వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ అంతర్జాతీయ ముస్లిం మిషనరీ గ్రూప్.. భారత్ లో ముస్లిం ఫోబియాను సృష్టిస్తున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో 950 మంది విదేశీ పౌరులను కూడా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కాగా.. ఈ కేసులో నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా ఇంకా అరెస్టు కాలేదని.. ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది సుప్రియా పండిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కోర్టు స్పందిస్తూ.. ‘మీరు ఒక వ్యక్తిపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారు..? మేము కోవిడ్ సమస్యపై ఆందోళన చెందుతున్నాం.. మీకు వివాదాలు ఎందుకు కావాలి...?’ అని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Farmers, Farmers Protest, New Agriculture Acts, Supreme Court