SAMAJWADI PARTY CHIEF AKHILESH YADAV AND SENIOR AZAM KHAN RESIGN FROM LOK SABHA AS BOTH ELECTED UTTAR PRADESH MLAS MKS
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్ రాజీనామా.. ఇక సీఎం యోగితో ఫేస్ టు ఫేస్.. ఆజం ఖాన్ కూడా..
లోక్ సభ స్పీకర్ కు అఖిలేశ్ రాజీనామా
ఇప్పుడుగానీ తాను రాష్ట్రాన్ని వీడి ఎంపీగా కొనసాగితే బలమైన ప్రతిపక్షమనే హోదాను బీజేపీ కచ్చితంగా గల్లంతు చేస్తుందనే ఆలోచనతో, పార్టీని కట్టడిలో ఉంచుతూ 2027 ఎన్నికలకు సమాయత్తం చేయడానికి అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం
ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్యను మెరుగుపర్చుకొని, బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా నిలబడింది సమాజ్ వాదీ పార్టీ. యూపీలో రాజకీయ పోరు బీజేపీ, ఎస్పీ మద్యే నెలకొని ఉన్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగానూ గెలుపొందిన ఆయన.. ఇక యూపీ అసెంబ్లీలో సీఎం యోగితో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడానికే సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు..
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంగళవారం కలుసుకున్న ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆజం గఢ్ నుంచి ఆయన ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖిలేశ్ తోపాటు ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ కూడా తన లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఈ ఇద్దరూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నుంచి ఆజాం ఖాన్ రాంపూర్ నుంచి ఎమ్మెల్యేలుగానే కొనసాగేందుకు వీలుగా ఎంపీ పదవులను త్యజించారు.
ఉత్తరప్రదేశ్ లో కచ్చితంగా అధికారం వస్తామని ధీమా ప్రదర్శించిన అఖిలేశ్ యాదవ్ అరడజను పార్టీలతో కూటమి ఏర్పాటు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ 111 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. బీజేపీకి సొంతగా 255, కూటమితో కలిపి 273 సీట్లు సాధించి వరుసగా రెండోసారి గద్దెనెక్కింది. రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఈనెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
యూపీలో బీజేపీకి ప్రత్యామ్నాయం సమాజ్ వాదీ పార్టీ ఒక్కటేనని తాజా ఎన్నికల్లో రుజువైన దరిమిలా, ఇప్పుడుగానీ తాను రాష్ట్రాన్ని వీడి ఎంపీగా కొనసాగితే బలమైన ప్రతిపక్షమనే హోదాను బీజేపీ కచ్చితంగా గల్లంతు చేస్తుందనే ఆలోచనతో, పార్టీని కట్టడిలో ఉంచుతూ 2027 ఎన్నికలకు సమాయత్తం చేయడానికి తాను స్థానికంగానే ఉండాలని అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.