SALMAN KHANS BIGG BOSS 13 IN BIG TROUBLE AS BJP MLA SEEKS BAN SK
Bigg Boss: బిగ్‌బాస్‌కు బీజేపీ ఎమ్మెల్యే బిగ్ షాక్
బిగ్ బాస్
బిగ్‌బాస్ షో భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందని మెమోరాండం సమర్పించారు. షోలో వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు ఒకే మంచంపై పడుకుంటున్నారని.. అలాంటివి ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.
బిగ్‌బాస్..! విదేశాల నుంచి భారత బుల్లితెరపైకి వచ్చిన ఈ రియాల్టి షో.. ముందు నుంచీ వివాదాల్లో ఉంది. హౌస్మేట్స్ అసభ్యకరంగా దుస్తులు ధరిస్తున్నారని, షోలో వల్గారిటీ ఎక్కువైందని, భారతీయుల మనోభావాలు దెబ్బతింటున్నాయని.. ఇలా ఎన్నో విమర్శలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలని పలు సంఘాలు సైతం ఆందోళనలు చేశాయి. తాజాగా మరోసారి బిగ్‌బాస్ హిందీ షో వార్తల్లో నిలిచింది. ఘజియాబాద్ (యూపీ)కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుజ్జర్ బిగ్‌బాస్ షోపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలోని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని.. అశ్లీలతను ఎక్కువగా చూపిస్తున్నారని నంద కిశోర్ ఆరోపించారు. కుటుంబమంతా కూర్చొని ఈ షో చూసే పరిస్థితి లేదని లేఖలో పేర్కొన్నారు. ఓ వైపు భారత కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేస్తుంటే మరోవైపు ఇలాంటి రియాల్టీ షోలు భారత సంస్కృతి సంప్రదాయాలను మంటగలుపుతున్నాయని విమర్శించారు. జాతీయ స్థాయి ఛానెల్లో హౌస్మేట్స్ బెడ్రూమ్ దృశ్యాలను చూపిస్తున్నారని.. అలాంటి షోలు చిన్నపిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి షోలు రాకుండే టీవీ కార్యక్రమాలను సైతం సెన్సార్ చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.
బ్రాహ్మణ మహాసభ సైతం బిగ్ బాస్-13 ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ ఘజియాబాద్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందని మెమోరాండం సమర్పించారు. షోలో వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు ఒకే మంచంపై పడుకుంటున్నారని.. అలాంటివి ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. అటు ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన సైతం బిగ్ బాస్ షోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రియాల్టీ షోపై నిషేధం విధించే వరకు తాను అన్నం తినబోనని UPNS అధ్యక్షుడు అమిత్ జాని తెలిపారు. కేవలం కూరగాయలు, పళ్లు మాత్రమే తీసుకుంటానని స్పష్టంచేశారు. ఇలా పలు సంఘాలు బిగ్ బాస్‌ను నిషేధించాలని ఆందోళనలు చేస్తుండడంతో నిర్వాహకులకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి.