news18-telugu
Updated: December 3, 2020, 6:50 AM IST
శబరిమల ఆలయం(ఫైల్ పొటో)
కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. తాజాగా నిర్ణయం ప్రకారం సాధారాణ రోజుల్లో రోజుకు రెండు వేల మంది భక్తులకు శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు అకాశం కల్పించనున్నారు. శని, ఆది వారాల్లో రోజుకు 3 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు.
ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు సాధారణ రోజుల్లో రోజకు వెయ్యి మందికి, శని, ఆది వారాల్లో రోజుకు 2వేల మంది భక్తులను దర్శనం కల్పిస్తున్నారు.
''శబరిమల ఆలయంలోకి మరింత మంది భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నాం. మొత్తం బుకింగ్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. భక్తులు ఈ మేరకు వెబ్సైట్ దర్శన టికెట్లు పొందవచ్చు. ప్రతి ఒక్క భక్తుడు కోవిడ్-19 మార్గదర్శకాలు పాటించాలి. నిలక్కల్ బేస్ క్యాంప్ చేరుకునేందుకు ముందు 24 గంట్లలోపు జారీచేసిన కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికెట్‌కు భక్తులు సమర్పించాల్సి ఉంటుంది. శబరిమల మార్గంలో ప్రభుత్వం, ప్రవేటు ఏజెన్సీలు నడుపుతున్న అధికారిక కోవిడ్-19 పరీక్షల కేంద్రాల్లో కూడా భక్తులు టెస్టులు చేయించుకోవచ్చు అని తెలిపారు.
భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. శబరిమల బేస్ క్యాంప్ శిబిరాల వద్ద యాంటిజెన్ పరీక్షలను ముమ్మరం చేసింది. ఇక, సోమవారం నుంచి సన్నిధానం, పంబ బేస్ క్యాంప్‌లో 14 రోజులకు పైగా విధులు నిర్వర్తిస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు , వాలంటీర్లకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పంబాలోని ఆరోగ్య కేంద్రంలో రోజుకు 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం పరీక్షలు చేయించుకున్న 200 క్లినింగ్ వర్కర్స్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వారిని ఎరుమెలిలోని కోవిడ్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినట్టు తెలిపారు.
ఇక, నవంబర్ 16న ఆలయం తెరిచినప్పటి నుంచి నవంబర్ 27వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 39 మందికి కరోనా సోకినట్టుగా అధికారులు తెలిపారు. అందులో భక్తులు, పోలీసు సిబ్బంది, ఆలయ ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు. ఇక, ఈ డిసెంబర్ మండల పూజ, జనవరి 14న మరకజ్యోతి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సీజన్ పూర్తి కాగానే జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నట్టు చెప్పారు.
Published by:
Sumanth Kanukula
First published:
December 3, 2020, 6:50 AM IST