హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

kuppepadavu Village: ఫొటో పంపిస్తే రూ.500.. ఆ ఊరి రూపురేఖలనే మార్చేసిన ఒక్క ఐడియా

kuppepadavu Village: ఫొటో పంపిస్తే రూ.500.. ఆ ఊరి రూపురేఖలనే మార్చేసిన ఒక్క ఐడియా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

kuppepadavu Village: గ్రామ పాలకవర్గం పదేపదే అభ్యర్థనలు, హెచ్చరికలు చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. ఇలాంటి వాళ్లకు జరిమానా విధించాలని భావించినా.. చెత్త ఎవరు పారబోస్తున్నారో తెలుసుకోవడం అసాధ్యంగా మారింది.

(రచయిత: సౌమ్య కలాస)

కొన్నిసార్లు చిన్న ఐడియా అయినా సరే పెద్ద మార్పులకు దారి తీస్తుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణ చాలా పేలవంగా ఉంటుంది. కొందరు ప్రజలు అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి ఇష్టానుసారం రోడ్లపై చెత్త విసిరేస్తుంటారు. ఒకరు చెత్త పారవేయడం ప్రారంభిస్తే చాలు మిగతా వారు కూడా అదే ప్రాంతాల్లో చెత్త డంప్ చేస్తుంటారు. ఫలితంగా ఎంతో శుభ్రంగా ఉండే ప్రాంతాలన్నీ చెత్తతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుంటాయి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కుప్పెపడవు(kuppepadavu) గ్రామం కూడా గత కొంతకాలంగా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. చాలా ఇతర ప్రదేశాల మాదిరిగానే ఈ గ్రామంలో కూడా ప్రజలు చెత్తను నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. ఫలితంగా ఆ గ్రామంలో ఎక్కడ చూసినా భారీ చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.

గ్రామ పాలకవర్గం పదేపదే అభ్యర్థనలు, హెచ్చరికలు చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. ఇలాంటి వాళ్లకు జరిమానా విధించాలని భావించినా.. చెత్త ఎవరు పారబోస్తున్నారో తెలుసుకోవడం అసాధ్యంగా మారింది. ఆధారాలు లేకుండా జరిమానా వేయడం అసాధ్యం కాబట్టి ఈ సమస్యకు ఏంటి పరిష్కారం? అని గ్రామపంచాయతీ అధికారులు సమాలోచనలు చేశారు. అప్పుడే వారికొక చిన్న ఐడియా తట్టింది. ఆ తెలివైన ఐడియాతో సీన్ మొత్తం మారిపోయింది. రోజూ నిర్లక్ష్యంగా చెత్త వేసే వారు ఇప్పుడు చెత్త కవర్లను ఇంటి నుంచి బయటకు తేవడానికే జంకుతున్నారు. ఇదే ఐడియాతో ఆ గ్రామమంతా ఇప్పుడు అత్యంత శుభ్రంగా మారిపోయింది. మరి ఆ గ్రామ పంచాయతీలు చేసిన ఆ ఐడియా ఏంటి? ఆ ఐడియో వల్ల ప్రజల్లో మార్పు ఎలా వచ్చిందో తెలుసుకుంటే..

Chennai Rains: రేపు, ఎల్లుండి భీకర వర్షాలు.. చెన్నైపై పగబట్టిన వరుణుడు.. నలుగురు మృతి

ప్రజల నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయిన కుప్పెపడవు గ్రామ పంచాయతీ అధికారులు చెత్త విసిరే వారిని ఆధారాలతో సహా పట్టుకొని జరిమానా విధించాలకున్నారు. రోడ్లపై చెత్త పడేసే మనుషులను ఫొటో లేదా వీడియోని తీసి తమకి అందజేసే వ్యక్తులకు రూ.500 రివార్డు ఇస్తామని గ్రామపంచాయతీ అధికారులు ప్రకటించారు. అలాగే వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విసిరివేసే వ్యక్తులకు రూ.1000 జరిమానా విధించాలని గ్రామ పాలకమండలి నిర్ణయించారు. ఈ ప్రకటనలు గ్రామంలో అనేక భారీ మార్పులను తీసుకొచ్చాయి.

Petrol Rate: పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించేందుకు కొన్ని రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి

"ఇంతకుముందు, గ్రామంలోని దాదాపు అన్ని ప్రధాన జంక్షన్లు చెత్త కుప్పలతో నిండిపోయి ఉండేవి. గ్రామపంచాయతీ ప్రకటనతో ఒక వారంలోనే ప్రతిదీ శుభ్రంగా తయారయింది. ఏ చోట కూడా చెత్త కనిపించడం లేదు. ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. దీనికి మా గ్రామ పంచాయతీని తప్పక అభినందించాలి” అని గ్రామ నివాసి మంజునాథ అన్నారు.

రూ.1000 జరిమానా, రూ.500 రివార్డుపై గ్రామపంచాయతీ గ్రామం అంతటా బోర్డులు ఏర్పాటు చేసింది. కొత్త నియమ నిబంధనల గురించి సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం చేసింది. "మా చివరి సమావేశంలో మేం ఈ విధంగా సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించుకున్నాం. ఫలితాలు ఇప్పటికే కనిపించాయి. చెత్త కుప్పలతో మురికిగా తయారైన ప్రాంతాలు అన్నీ ఇప్పుడు శుభ్రంగా ఉన్నాయి. మేం గ్రామం అంతటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అని పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO) సవిత మండోలికర్ తెలిపారు. గ్రామస్తులు ఇప్పుడు తడి, పొడి చెత్తను సరిగ్గా వేరు చేస్తున్నారు.

First published:

Tags: Karnataka, Village

ఉత్తమ కథలు