కేంద్ర ఎన్నికల సంఘం పంపిన... ఫ్లైయింగ్ స్వ్కాడ్ (ఐటీ అధికారులు)... తమిళనాడులో దాడులు చేస్తూ రూ.1 కోటి 50లక్షల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 94 ఎన్వలప్ కవర్లలో ఆ డబ్బు ఉన్నట్లు గుర్తించారు. ఆ కవర్లపై వార్డ్ నంబర్... ఓటర్ల సంఖ్య, ఒక్కొక్కరికీ రూ.300 ఇవ్వాలని రాసివుంది. ఇదంతా TTV దినకరన్ పార్టీ AMMK నేతలకు చెందినదేనని అధికారులు తెలిపారు. తమిళనాడులోని థేనీ జిల్లాలో ఉన్న అండిపత్తిలో ఈ డబ్బును కనిపెట్టారు. అండిపత్తిలో గురువారం అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. మంగళవారం రాత్రి దాడులు ప్రారంభించిన ఐటీ అధికారులు... ఉదయం 5.30 వరకూ కొనసాగించారు. ఐతే... అండిపత్తి అసెంబ్లీ ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ పేపర్‌కి సంబంధించి పంపిణీ చేసేందుకు ఆ డబ్బును AMMK అభ్యర్థి సిద్ధం చేసినట్లు తేలింది.
ఈ దాడులు కొనసాగించేందుకు ఐటీ అధికారులు వచ్చినప్పుడు... AMMKకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి... ఐటీ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అలర్టైన పోలీసులు మామూలుగా చెబితే మాట వినట్లేదనీ... గాలిలో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అంతే... పార్టీ కార్యకర్తలకు టెన్షన్ మొదలైంది. డబ్బుల కోసం ఎదిరిస్తే, ప్రాణాలే పోతాయన్న భయం ఎక్కువవడంతో... వెనక్కి తగ్గారు.
తమిళనాడులో పెద్ద ఎత్తున అక్రమ మనీ పంపిణీ అవుతున్నట్లు తెలియడంతో... పోలీసులు కొన్ని వారాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఎక్కువగా ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నారు. గత వారం ఐటీ అధికారులు చెన్నై, నమక్కల్, తిరునల్వేలి సహా 18 చోట్ల దాడులు చేశారు.
మంగళవారం తమిళనాడులో DMK తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... ఐటీ దాడులను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించేవాళ్లను టార్గెట్ చేస్తూ... దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.