Rising India Summit 2019: దేశానికి సరికొత్త దిశ చూపే వేదిక 'రైజింగ్ ఇండియా సమ్మిట్ 2019'

Rising India Summit 2019 | దేశంలోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్ అయిన న్యూస్ 18 నిర్వహిస్తున్న Rising India Summit 2019 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానోపన్యాసం ఉంటుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 'బియాండ్ పాలిటిక్స్: డిఫైనింగ్ నేషనల్ ప్రియారిటీస్' అనే థీమ్‌తో ఈ సమ్మిట్ జరగనుంది.

news18-telugu
Updated: February 25, 2019, 12:50 PM IST
Rising India Summit 2019: దేశానికి సరికొత్త దిశ చూపే వేదిక 'రైజింగ్ ఇండియా సమ్మిట్ 2019'
Rising India Summit 2019: దేశానికి సరికొత్త దిశ చూపే వేదిక 'రైజింగ్ ఇండియా సమ్మిట్ 2019'
  • Share this:
ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వేడి... మరోవైపు కాశ్మీర్‌లో ఉగ్రదాడి... దేశమంతా రాజకీయ హడావుడి... వీటితో పాటు దేశం ముందు పలు రంగాలకు సంబంధించి అనేక సవాళ్లు... వీటన్నింటిపై అన్ని వర్గాలు  సమగ్రంగా చర్చించి, మేథోమథనం చేసేందుకు న్యూస్18 నెట్‌వర్క్  సమోన్నత వేదికను ఏర్పాటు చేయనుంది. అదే  రైజింగ్ ఇండియా సమ్మిట్-2019(Rising India Summit 2019). ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో దేశరాజధానిలో జరగబోయే అతిపెద్ద ఈవెంట్‌ ఇది.  దేశంలోని విభిన్న ప్రాంతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ గళాన్ని వినిపించేందుకు ఈ వేదిక ఓ చక్కటి అవకాశాన్ని కల్పించనుంది.

దేశంలోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్ అయిన న్యూస్ 18 నిర్వహిస్తున్న Rising India Summit 2019 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానోపన్యాసం ఉంటుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 'బియాండ్ పాలిటిక్స్: డిఫైనింగ్ నేషనల్ ప్రియారిటీస్' అనే థీమ్‌తో ఈ సమ్మిట్ జరగనుంది.


రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు పార్టీలకు చెందిన దిగ్గజ నేతలు, యువనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, సినిమా స్టార్లు దీపికా పదుకొనె, కమల్ హాసన్, ఆధ్యాత్మిక గురువు సద్గురు, ఇలా పదుల సంఖ్యలో ప్రముఖులు ఢిల్లీలోని డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లో జరిగే రైజింగ్ ఇండియా సమ్మిట్-2019లో తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

మొదటి రోజు ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు, యోగా గురువు బాబా రాందేవ్ మధ్య, అడ్వర్టైజింగ్ ఐకాన్ ప్రసూన్ జోషి మధ్య చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయెల్ మధ్య 'ఇండియా అహోయ్: గ్రోత్ అండ్ గుంప్షన్' అనే అంశంపై చర్చ జరుగుతుంది. విధాన రూపకర్తలు, వ్యాపార దిగ్గజాలతో ప్యానెల్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రసంగాలు, పరస్పర చర్చా కార్యక్రమాలు ఉంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేస్తారు.

గతేడాది Rising India Summit మొదటి ఎడిషన్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ రైజింగ్ ఇండియా అంటే దేశంలోని ప్రతీ పౌరుడు స్వీయ గౌరవంతో ముందుకెళ్లడమే అని అన్నారు. ఈ ఏడాది ఆయన ఇటీవల దేశంలోని పరిణామాలపై సరికొత్త పరిష్కారాలను నిర్విచిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో రైజింగ్ ఇండియా సమ్మిట్ మొదటి రోజు ముగుస్తుంది.


రెండో రోజు రైజింగ్ ఇండియా సమ్మిట్ వేర్వేరు రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కళకళలాడుతుంది. సృజనాత్మకంగా, విభిన్నంగా అభిప్రాయాలను రాబట్టేలా ప్రతీ ప్యానెల్‌ను జాగ్రత్తగా ఎంపిక చేయడం విశేషం. 'మహాభారత్' పేరుతో నిర్వహించే సెషన్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భాగేల్, వి.నారాయణస్వామి, కాన్రాడ్ సంగ్మా, జైరామ్ ఠాకూర్ వేర్వేరు సెషన్లలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. దక్షిణాది సూపర్‌స్టార్, ఇటీవల రాజకీయ తెరపైకి వచ్చిన కమల్ హాసన్... తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సివచ్చిందో వివరిస్తారు.

యూత్ ఐకాన్‌గా సినీ నటి దీపికా పదుకొనె సినిమా రంగంలో తన అనుభవాలను పంచుకుంటారు. భారత సినిమా రంగాన్ని మరో మెట్టెక్కించేందుకు తన వంతు సలహాలు, సూచనలు చేస్తారు.  ఆ తర్వాత కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, కాంగ్రెస్‌కు చెందిన ఆర్‌పీఎన్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మధ్య జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిసాధనపై ఆసక్తికర రాజకీయ చర్చ ఉంటుంది.
ఈ సమ్మిట్‌లో యువ రాజకీయవేత్తలు, క్రీడాకారుల సెషన్స్ మరిన్ని హైలైట్స్. కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, క్రికెట్ ఐకాన్ అనిల్ కుంబ్లే, బాక్సింగ్ ఛాంపియన్ మేరీకామ్ ‘తీవ్రవాద నీడలో క్రీడా సంబంధాలు కొనసాగింపు’ అనే అంశంపై చర్చిస్తారు. బాలీవుడ్ స్టార్ తాప్సీ పన్ను, మహారాష్ట్ర పొలిటీషియన్ సుప్రియా సూలే, మళయాళం నటి పద్మప్రియ, రచయిత, సినీ నిర్మాత పరోమితా వోహ్రా, సోషల్ కామెంటేటర్ సంతోష్ దేశాయ్ లాంటి వాళ్లు యావత్ దేశాన్ని కుదిపేసిన #MeToo, లింగ సమీకరణలు అంశంపై ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. యువతరం రాజకీయ నాయకులైన ఏపీ మంత్రి నారా లోకేష్(టీడీపీ), నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత(టీఆర్ఎస్), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అనురాగ్ ఠాకూర్(బీజేపీ), చిరాగ్ పాశ్వాన్(ఎల్‌జేపీ), దివ్య స్పందన(కాంగ్రెస్), జయంత్ చౌదరీ(ఆర్‌ఎల్‌డీ)తో మరో ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత ఒమర్ అబ్దుల్లా, సచిన్ పైలట్, బాబుల్ సుప్రియోలు 'భారత రాజకీయ సంగం' అనే అంశంపై మాట్లాడతారు. మొత్తంగా Rising India 2019 దేశంలోని అన్ని రంగాలు, ప్రాంతాలు, వర్గాలకు చెందిన నిపుణులు, మేధావుల అభిప్రాయాలకు వేదికగా మారనుంది.

ఇవి కూడా చదవండి:

WhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
First published: February 25, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading