బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ నెల రోజుల క్రితం అరెస్టైన ఆయన ప్రియురాలు, బాలీవుడ్ బామ రియా చక్రవర్తి బుధవారమే జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. 28 రోజులు జైలులోనే ఉన్న ఆమె.. మరి అక్కడ ఎలా గడిపారు. ఇదే విషయమై రియా తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీశ్ స్పందించారు.
సతీశ్ మాట్లాడుతూ... జైలులో సానుకూలంగా ఉండేందుకు ఆమె ప్రయత్నించిందని తెలిపారు. జైళ్లో ఆమె చాలా వేధింపులకు గురైందనీ.. సూటిపోటి మాటలతో ఆమెను వేధించారని ఆరోపించారు. వీటన్నింటిని భరిస్తూ.. తనను సర్ధి చెప్పుకుందని వివరించారు. యోగా తెలిసిన రియా.. జైళ్లో యోగా చేస్తూ.. తన తోటి వాళ్లకు కూడా యోగా చేయడం నేర్పిస్తూ స్వాంతన పొందేదని తెలిపారు. కోవిడ్ కారణంగా ఆమె ఇంట్లో తినే పౌష్టికాహారం తీసుకోలేదని కానీ తనను తాను సర్దుబాటు చేసుకున్నదని పేర్కొన్నారు. తనతో ఉన్న ఖైదీలతో సాధారణ జీవితం గడిపిందని అన్నారు.
ఆర్మీ అమ్మాయి కావడంతో.. యుద్ధం వంటి పరిస్థితులను వచ్చినా ఎదుర్కునే సత్తా తనకు ఉన్నదని చెప్పారు. అందుకే జైలులో తననెవరూ ఏమన్నా.. సానుకూలంగా ఉంటూ ఆ పరిస్థితులతో పోరాడిందని చెప్పారు. ఇక ఆమెకు బెయిల్ రావడంపై సతీశ్ స్పందిస్తూ.. బెంగాల్ టైగర్ తిరిగి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు కారణంగా ఆమె కోల్పోయిన ఇమేజీని తిరిగి పునరుద్ధరించడానికి తాను ప్రయత్నిస్తానని వివరించారు. తాను న్యాయవాదిగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నా.. జైలుకు వెళ్లి ఎవరినీ కలవలేదనీ, కానీ ఆమెను చూడటానికి వెళ్లానని చెప్పుకొచ్చారు.
సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె.. గతనెల పలు దఫాల పోలీసులు, నార్కోటిక్స్, ఇతర విచారణ సంస్థల దర్యాప్తు తర్వాత.. సెప్టెంబర్ 8న అరెస్టయ్యారు. అప్పటినుంచి ముంబయిలోని బైకుల్లా జైలులో 28 రోజులున్నారు. కాగా, బుధవారం సాయంత్రం ఆమెకు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. కానీ ఇదే కేసులో జైలులో ఉన్న ఆమె సోదరుడికి మాత్రం బెయిల్ రాలేదు. రియాకు బెయిల్ రావడాన్ని సతీశ్ స్వాగతించారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పారు. విచారణ సంస్థలు ఆమెను విచారణ పేరిట తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయనీ, కానీ తాము సత్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
డ్రగ్స్ కేసులో పలువరు బాలీవుడ్ నటీమణుల పేర్లు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ అగ్ర నటీమణులు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సోహా అలీఖాన్ ల పేర్లు బయటకు రాగా.. వారు విచారణకు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood heroine, Rhea Chakraborty, Sushanth singh Rajputh