కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో... జమ్మూకాశ్మీర్లోని సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(Armed Forces Special Powers Act (AFSPA)) సవరిస్తామనే ప్రతిపాదన పెట్టింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఆ చట్టాన్ని సవరించడమంటే... సైనికుల్ని ఉరికంబం ఎక్కించడంతో సమానమని వ్యాఖ్యానించారు. న్యూస్18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ప్రత్యేక అధికారాల చట్టం ద్వారా సైనిక దళాలకు తగిన రక్షణ ఉందనీ, అది అలాగే ఉండాలని మోదీ అన్నారు. సైనిక దళాలను రక్షించేందుకు ప్రభుత్వానికి కచ్చితంగా అధికారం ఉండాలనీ, అప్పుడు మాత్రమే సైనికులు బలంగా యుద్ధం చెయ్యగలరనీ మోదీ అన్నారు. ఆ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లో సవరించనివ్వనని మోదీ తెలిపారు.
గత వారం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో... సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సవరిస్తామన్న ప్రతిపాదనను బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఖండించారు. కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్లో ప్రమాదకర ఐడియాలు ఉన్నాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ నేతలు దేశ సమైక్యతకు భంగం కలిగించేలా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం ఉన్న వివాదాస్పద చట్టాల్ని, నిబంధనల్ని తొలగించడమో లేక సవరించడమో చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. దర్యాప్తు లేకుండా బంధీ చెయ్యడాన్నీ సవరిస్తామనీ, హింసను అడ్డుకునే చట్టం తెస్తామనీ, సైనిక అధికారుల ప్రత్యేక చట్టాన్ని సవరిస్తామనీ హామీ ఇచ్చింది. అంతేకాదు... జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న సందర్భాలున్నందున ఆ చట్టాన్ని సవరించాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
సంకల్ప్ పత్ర పేరుతో బీజేపీ సోమవారం తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అందులో జాతీయ భద్రతపై ఎక్కువ దృష్టి సారించింది. సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం ద్వారా సైనికులకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. వారెంట్ లేకుండా అరెస్టు చెయ్యగలరు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కాల్పులు జరపగలరు. ఈ చట్టాన్ని జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు వ్యతిరేకిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.