వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రులకు వెళుతున్నారా? అయితే ఇవాళ్టి నుంచి దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో చిన్న డాక్టర్లు (Doctors) అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ కేసులు తప్ప సాధారణ ఓపీ, ఇతర కేసులను వారు చూడబోవడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఈ పరిస్థితి ఉన్నా, పూర్తిగా చిన్న డాక్టర్లతోనే నడిచే ప్రభుత్వం ఆస్పత్రులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. శనివారం(నవంబర్ 27) నుంచి దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు రెసిడెంట్ డాక్టర్స్ (Resident doctors nationwide strike) ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవాళ్టి నుంచి అన్ని రాష్ట్రాల్లో తాము సమ్మెకు దిగుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA calls for strike) ప్రకటించింది. ఔట్ పేషెంట్ విభాగంలో విధులు నిర్వర్తించే రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ధర్నాలో పాల్గొంటారని ఫోర్డా స్పష్టంచేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ కౌన్సిలింగ్ (నీట్ పీజీ కౌన్సిలింగ్ ) (NEETPG Counselling 2021) పదే పదే వాయిదా పడుతుండటంతో కెరీర్ పై భయాందోళన పెరిగిపోతోందని ఆరోపిస్తోన్న రెసిడెంట్ డాక్టర్లు, కౌన్సిలింగ్ వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి దేశవ్యాప్త ధర్నా చేపట్టారు.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వేలాది మంది ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం విద్యార్థులను సైతం వైద్య సేవలకు వినియోగించుకోవడం తెలిసిందే. వాళ్ల పనికి ఆటంకాలు ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం నీట్ పీజీ కౌన్సిలింగ్ ను వాయిదా వేసింది. అయితే, కొవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత కూడా నీట్ పీజీ కౌన్సిలింగ్ చేపట్టకపోవడాన్ని రెసిడెంట్ డాక్టర్లు నిరసిస్తున్నారు. ఇప్పటికే నీట్ పీజీ కౌన్సిలింగ్ ఆలస్యమైందని, మళ్లీ మళ్ల ీవాయిదా వేయడం ఏంటని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తాము ముందు వరుసలో ఉండి రోగులకు సేవలు చేస్తున్న తమను ఇంకా ఇబ్బందులు పాలుచేయడం తగదని ఫోర్డా అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ఆందోళనను దృష్టిలో పెట్టుకుని నీట్ పీజీ కౌన్సిలింగ్, అడ్మిషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీం కోర్టును వేడుకుంటున్నట్టు వారు తెలిపారు.
నీట్ పీజీ కౌన్సిలింగ్ పై అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైన తర్వాతే సమ్మెకు దిగాలనే తీవ్ర చర్యకు పూనుకున్నామని, మరో దారిలేకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని రెసిడెంట్ డాక్టర్లు చెబుతున్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుల నుంచి సరైన స్పందన రాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వైద్య సేవలు స్తంభింస్తే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అని వారు హెచ్చరించారు. నీట్ పీజీ అడ్మిషన్లు, ఫీజు నిర్ణయం అంశంపై విచారణ జరుపుతోన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసిన నేపథ్యంలోనే తాము ధర్నా చేపట్టామని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.