హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Reservations: ఎస్టీల రిజర్వేషన్ల పెంపును కొట్టివేసిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు.. రాజ్యాంగ విరుద్ధం..అంతకంటే ఎక్కువ ఉండకూడదు

Reservations: ఎస్టీల రిజర్వేషన్ల పెంపును కొట్టివేసిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు.. రాజ్యాంగ విరుద్ధం..అంతకంటే ఎక్కువ ఉండకూడదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chhattisgarh High Court:  రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి మించి పెంచడం.. సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీల రిజర్వేషన్‌కు (Chhattisgarh ST Reservations) బ్రేకులు పడ్డాయి. ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ 10 ఏళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు (High Court) తాజాగా కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ పి.పి.సాహూల ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఐతే ఇప్పటికే ఆ జీవో కారణంగా పొందిన ప్రవేశాలు, ఉద్యోగాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని వెల్లడించింది.

  ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2012లో రిజర్వేషన్లపై చట్ట సవరణ చేసింది. ఎస్సీ రిజర్వేషన్లను తగ్గించి.. ఎస్టీ రిజర్వేషన్‌లను పెంచింది. బీసీ రిజర్వేషన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ నిర్ణయంతో ఎస్సీల రిజర్వేషన్లు 16 శాతం నుంచి 12 శాతానికి తగ్గాయి. ఐతే ఎస్టీల కోటాను ఏకంగా 12 శాతం మేర పెరిగి.. 18 శాతం నుంచి 30శాతానికి చేరింది. ఓబీసీల రిజర్వేషన్లు 14 శాతం మేర ఉంది. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. తద్వారా విద్యా, ఉద్యోగ నియామకాల్లో మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న పరిమితి ఉంది. ఐనప్పటికీ అప్పటి బీజేపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా 58శాతానికి పెంచింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. గురు ఘాసీదాస్ సాహిత్య సమితితో పాటు మరికొందరు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై దాదాపు 10 ఏళ్లుగా విచారణ జరిగింది. జులైలో విచారణ పూర్తిగాకా.. సోమవారం తీర్పును వెలువరించింది హైకోర్టు. రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

  రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి మించి పెంచడం.. సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం చేయకుండానే.. రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అసలు రిజర్వేషన్ల పరిమితిని పెంచూతూ.. తీసుకున్న అసాధారణ నిర్ణయానికి.. దారితీసిన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం సహేతుకంగా వివరించలేకపోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ కుమార్ పాండే తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టు దానిని కొట్టివేసిందిన చెప్పారు.

  కాగా, తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్‌లను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది వరకు 6శాతంగా ఉన్న గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకొని.. అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ఆమోదం కోసం పంపినా.. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఎదురు చూసి..ఎదురుచూసి.. విసిగిపోయామని.. అందువల్ల కేంద్ర నిర్ణయంతో పాటు సంబంధం లేకుండా.. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవోను జారీ చేస్తామని స్పష్టం చేశారు. దానిని కేంద్రం అమలు చేస్తుందా? ఉరి తాడు చేసుకుంటుందా? వారి ఇష్టమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐతే తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 50శాత కంటే తక్కువగానే ఉన్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chhattisgarh, ST Reservations

  ఉత్తమ కథలు