రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమిళనాడు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం మెడికల్ డిగ్రీ, పీజీ, డెంటల్ కాలేజీల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం లేదంటూ కేంద్రం తీరును తప్పుపడుతూ వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారణ జరిపింది. ‘రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కు కాదు.’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. డీఎంకే, వైకో, సీపీఎం, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, సీపీఐలు దాఖలు చేసిన పిటిషన్లతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ‘మీరు ఈ పిటిషన్లను విత్ డ్రా చేసుకుని హైకోర్టుకు వెళ్లండి.’ అని సూచించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మినహా, మిగిలిన కాలేజీల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని, దీన్ని కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని డీఎంకే తమ పిటిషన్లో ప్రశ్నించింది. మెడికల్ సీట్ల భర్తీ సమయంలో రాష్ట్రాల రిజర్వేషన్ చట్టాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమలు చేయాలని స్పష్టం చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.