REPUBLIC DAY 2022 TELUGU JAWAN JASWANTH KUMAR REDDY AMONG 317 ARMY PERSONNEL CONFERRED WITH GALLANTRY AND DISTINGUISHED SERVICE AWARDS MKS
Republic Day 2022: తెలుగు బిడ్డ జశ్వంత్‌కు శౌర్యచక్ర.. మరో 11 మంది జవాన్లకూ.. గాలంట్రీ, పోలీస్ మెడల్స్ ఎందరికంటే..
అమరజవాన్ జశ్వంత్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ డే సందర్భంగా సాయుధ బలగాలకు ఇచ్చే గాలంట్రీ, విశిష్ట సేవా మెడల్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలుగువాడైన జవాన్ జశ్వంత్ కుమార్ రెడ్డితోపాటు మరో 11 మందికి శౌర్యచక్ర అవార్డు లభించింది. 29 మందికి పరమ్ విశిష్ట్ సేవా మెడల్ దక్కింది. మొత్తంగా 384 గాలంట్రీ అవార్డులు సహా 939 పోలీసు మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది. వివరాలివి..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ దేశం ఉత్సాహంతో నిండిపోయింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వేడుకలు జరుగుతున్నాయి. అదే సమయంలో అమరవీరుల త్యాగాలను సైతం దేశం గుర్తుచేసుకుంటున్నది. రిపబ్లిక్ డే సందర్భంగా సాయుధ బలగాలకు ఇచ్చే గాలంట్రీ, విశిష్ట సేవా మెడల్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలుగువాడైన జవాన్ జశ్వంత్ కుమార్ రెడ్డితోపాటు మరో 11 మందికి శౌర్యచక్ర అవార్డు లభించింది. 29 మందికి పరమ్ విశిష్ట్ సేవా మెడల్ దక్కింది. మొత్తంగా 384 గాలంట్రీ అవార్డులు సహా 939 పోలీసు మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది. వివరాలివి..
ఉగ్రవాదులను తుదముట్టించడంలో ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరుగురు సైనికులు సహా మొత్తం 12 మందికి కేంద్రప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. వీరిలో తొమ్మిది మందికి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి. పురస్కారాలు అందుకొన్న వారిలో తెలుగువ్యక్తి సిపాయి మరుప్రోలు జశ్వంత్ కుమార్ రెడ్డి (మరణానంతరం)తో పాటు నాయిబ్ సుబేదారు శ్రీజిత్ ఎం (మరణానంతరం), హవిల్దార్ అనిల్ కుమార్ తోమర్ (మరణానంతరం), హవిల్దార్ రాశీరాయ్ బమ్మనల్లి (మరణానంతరం), హవిల్దార్ పింకూ కుమార్ (మరణానంతరం), రైఫిల్‌మ్యాన్ రాకేశ్ శర్మ (అస్సాం రైఫిల్స్), కమాండెంట్ దిలీప్ మాలిక్, అస్టిస్టెంట్ కమాండెంట్ అనిరుద్ ప్రతాప్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ అజీత్ సింగ్ (మరణానంతరం), హెడ్ కానిస్టేబుల్ కుల్దీప్ కుమార్ ఉరవన్ (మరణానంతరం), కానిస్టేబుల్ వికాస్ కుమార్ (మరణానంతరం), కానిస్టేబుల్ పూర్ణానంద్ (మరణానంతరం) ఉన్నారు.
వీరితో పాటు 29 మందికి పరమ్ విశిష్ట్ సేవా మెడల్ (పీవీఎస్ఎం), 59 మందికి అతి విశిష్ట్ సేవా మెడల్ (ఏవీఎస్ఎం), 122 మందికి విశిష్ట్ సేవా మెడల్ (వీఎస్ఎం), నలుగురికి ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్ (యూవైఎస్ఎం), 13 మందికి యుద్ధ్ సేవా మెడల్ (వైఎస్ఎం), 83 మందికి సేనా మెడల్ (గాలంట్రీ) మరో 62 మందికి సేనా మెడల్ (విశిష్ట సేవ) కలిపి మొత్తం 384 గాలంట్రీ సహా మొత్తం 939 పోలీసు మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది.
జవాన్ మరుప్రోలు జశ్వంత్ కుమార్ రెడ్డి (23) ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందినవారు. గతేడాది జూలై 8న జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్బావి సెక్టార్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందారు. జశ్వంత్ 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. మరణించే సమయానికి జమ్ముకశ్మీర్‌లో ఇన్‌ఫ్రాంటీ విభాగంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కశ్మీర్ అడవుల్లో జూలై 8న గాలింపు చర్యలు చేపడుతుండగా జశ్వంత్ ఆయన బృందంపై ముష్కరులు కాల్పులకు దిగారు. టీమ్ కమాండర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అది చూసిన జశ్వంత్ ప్రాణాలకు తెగించి ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకువస్తున్న క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్లు దిగి రక్తమోడుతున్నా.. జశ్వంత్ కమాండర్‌ను విడిచిపెట్టలేదు. అయన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చి.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాడు. దీంతో ముష్కరుడు మరణించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో జశ్వంత్ అమరుడయ్యాడు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.