Republic Day 2021: జాతీయ జెండాకు సెల్యూట్ చేయనన్న గాంధీజీ..ఎందుకో తెలుసా?

జాతిపిత మహాత్మాగాంధీ(ఫైల్ ఫోటో)

Republic Day 2021: జాతీయ జెండాలో అశోక చక్రం ప్రతిపాదనపై గాంధీజీ లాహోర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఓ సమావేశంలో మాట్లాడుతూ... జాతీయ జెండాపై చరఖా లేకుంటే.. నేను సెల్యూట్ చేయనని ఆవేశంగా చెప్పారట. ఆ విషయాన్ని గాంధేయవాది స్కాలర్, రీసెర్చర్  ఎల్ఎస్ రంగరాజన్ ఓ ఆర్టికల్‌లో పేర్కొన్నారు

  • Share this:
    మువ్వన్నెల జాతీయ పతకాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ప్రతి ఏటా స్వాంత్రత్య్ర, గణతంత్ర దినోత్సవ రోజుల్లో మనం త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేస్తాం. కానీ జాతీయ జెండాకు తాను సెల్యూట్ చేయనని మన జాతి పిత గాంధీజీ ఓ సందర్భంలో చెప్పారు. అందుకు బలమైన కారణమే ఉంది. స్వాంతంత్య్రానికి ముందు భారత జాతీయ జెండాకు రూపకల్పన జరుగుతున్న సమయంలో అన్ని వర్గాల నుంచి ఎన్నో సలహాలు సూచనలు వచ్చాయి. పింగళి వెంకయ్య పలు నమూనాలను రూపొందించారు. 1919 ఏప్రిల్‌లో  గాంధీజీ సైతం సలహాలు ఇచ్చారు. జాతీయ జెండాను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో ఉండాలని.. కాషాయం హిందువులు, ఆకుపచ్చ  రంగు ముస్లింలు, తెలుపు రంగు ఇతర మైనార్టీ వర్గాలకు ప్రతీక అని తెలిపారు. మధ్యలో  చేనేత చరఖా (రాట్నం) ఉండాలని సూచించారు.

    రాట్నం కేవలం నూలు వడికే యంత్రం కాదన్నది గాంధీజీ అభిప్రాయం. చరఖా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోందని చెప్పేవారు. పేద-ధనిక, యజమాని-కార్మికుడన్న తారతమ్యాలు లేకుండా అందరినీ కలిపే బంధమని అభివర్ణించారు. ఐతే  ఈ ప్రతిపాదనను కాంగ్రెసేతరులు వ్యతిరేకించారు. మూడు రంగులతో పాటు చరఖా ఉంటే అది కాంగ్రెస్ జెండా అవుతుందని  కానీ..జాతీయ జెండా కాదని విమర్శించారు. ఈ క్రమంలోనే  జెండాలో చరఖాని పొందుపరచడంపై అందరూ వెనక్కి తగ్గారు.

    జాతీయ జెండా డిజైన్‌ను ఖరారు చేసేందుకు 1931 ఏప్రిల్ 2న  కాంగ్రెస్ పార్టీ ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. చరఖాపై అభ్యంతరాలు రావడంతో ఆ స్థానంలో 8 ఆకుల బుద్ధ చక్రాన్ని పెట్టాలని భావించారు. కానీ చివరకు అశోక చక్రవర్తి స్థూపంపై ఉండే 24 ఆకుల అశోక చక్రాన్ని పొందుపరచాలని ఓ నిర్ణయానికి వచ్చారు.  1931 ఆగస్టులో ఆ ప్రతిపాదనను ఆల్  ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

    అశోక చక్రం ప్రతిపాదనపై గాంధీజీ లాహోర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఓ సమావేశంలో మాట్లాడుతూ... జాతీయ జెండాపై చరఖా లేకుంటే..  నేను సెల్యూట్ చేయనని ఆవేశంగా చెప్పారట. ఆ విషయాన్ని గాంధేయవాది స్కాలర్, రీసెర్చర్  ఎల్ఎస్ రంగరాజన్ ఓ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. కానీ చివరకు మూడు రంగులతో పాటు అశోక చక్రం ఉన్నడిజైన్‌కే  రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఆమోదించింది. 1947 జులై 22న అంబేద్కర్ నేతృత్వంలోని  కమిటీ త్రివర్ణ పతాక డిజైన్‌కు ఆమోద ముద్ర వేసింది.

    చివరకు మహాత్మా గాంధీ సైతం.. తన అసంతృప్తిని పక్కనపెట్టారట. త్రివర్ణ పతాకంలోని అశోక చక్రం అహింసకు ప్రతీక అని పలు సందర్భాల్లో ఆయన చెప్పినట్లు చరిత్రకారులు పేర్కొంటారు.
    Published by:Shiva Kumar Addula
    First published: