అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రామ మందిర ఆయల నమూనాకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించనున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇది అయోధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. రామ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన ఈ పురాతన నగరంలో ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, విలువలకు శకటం అద్దం పడుతుందని ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. శకటం ముందు భాగంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మధ్య భాగంలో భక్తులు రాముడిని కీర్తిన్నట్లు ఉంది. శకటం వెనుక భాగంలో రామ మందిరం నమూనా ఉంది. వారసత్వ సంపద విలువను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈ శకటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ శకటంలో చూడవచ్చు. అప్పటి సామాజిక, మతపరమైన పరిస్థితులు, సనాతన ధర్మం, విలువలను ఇవి గుర్తుచేస్తున్నాయి. షబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తినడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, అహల్యకు సంబంధించిన సన్నివేశం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, అశోకవనం... వంటివాటిని శకటంలో తీర్చిదిద్దారు.
అప్పట్లో అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నివేశాలు కూడా చూడవచ్చు. 2017 నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది. పరేడ్‌లో ఈ శకటానికి రెండు వైపులా సాధువులు, పూజారులు నడుస్తూ రాముడిపై తమ ప్రేమను చాటనున్నారు.
Published by:Sumanth Kanukula
First published:January 23, 2021, 10:26 IST