అనంతకుమార్: అజాతశత్రువు, అందరివాడు..

రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీలో ఏం పనులు కావాలన్నా కూడా ఆయనను పట్టుకుంటే అవుతుందనే అభిప్రాయం చాలా మందికి ఉంది.

news18-telugu
Updated: November 12, 2018, 1:35 PM IST
అనంతకుమార్: అజాతశత్రువు, అందరివాడు..
బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ ఈ ఏడాది నవంబర్ 12న కన్నుమూశారు. దక్షిణ బెంగళూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయి, మోదీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.
  • Share this:
వ్యాస రచయిత డీపీ సతీష్, సీఎన్ఎన్ - న్యూస్‌18

అవి 1996 లోక్‌సభ ఎన్నికలు. బెంగళూరు సౌత్‌‌ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ ఆర్ధికవేత్త ప్రొఫెసర్ కె.వెంకటగిరి గౌడకు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆయన ప్లేస్‌లో ఓ కొత్త ముఖాన్ని తీసుకొచ్చి నిలబెట్టింది. ఆయనే అనంతకుమార్. ఆ నిర్ణయంత అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి ఆయన వయసు 36 ఏళ్లు. పైగా ఆయన నాన్ లోకల్. హుబ్లీ ధార్వాడ నుంచి వచ్చిన వక్తికి బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో ఎంపీగా నిలబెట్టడం అనేది సాహసమే. ఆ సమయంలో హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి గుండూరావు భార్య వరలక్ష్మి (వితంతువు) పోటీలో ఉన్నారు. ఇంత బలమైన పోటీతో పాటు బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో మరో సెంటిమెంట్ కూడా ఉంది. అక్కడ అధికార పార్టీ ఎంపీ ఎప్పుడూ ఓడిపోతుంటారు. కొన్ని దశాబ్దాలుగా అలాగే జరుగుతూ వచ్చింది. కానీ, అవన్నీ బ్రేక్ చేశారు అనంతకుమార్. వరలక్ష్మి మీద స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. ఆరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే చాలా మంది అంచనాలను తలకిందులు చేశారు.

అప్పటి వరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీలో మాత్రమే పరిచయం ఉన్న అనంతకుమార్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అందరూ ఎవరా వ్యక్తి? అని చర్చించుకునే స్థాయికి వెళ్లారు. బీఎస్ యడ్యూరప్ప విసిరిన ఆ బాణం ఆ తర్వాత క్రియాశీలకంగా మారింది. రాజకీయాలను త్వరగా ఒంటబట్టించుకున్నారు. శత్రువులు కూడా పక్కనే ఉండే పాలిటిక్స్‌లో మిత్రులను పెంచుకున్నారు. తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లినా.. కొత్త అనిపించుకోలేదు. హేమాహేమీలైన వాజ్‌పేయి, అద్వానీ లాంటి వారి మన్ననలు పొందారు. పార్లమెంట్ కారిడార్లో ప్రతి ఒక్కరికీ తెలిసిన వ్యక్తిలా మారిపోయారు.

1996కి ముందు అనంతకుమార్ ఏబీవీపీ నాయకుడు. సంఘ్ నాయకత్వం అతడ్ని బీజేపీలోకి తీసుకొచ్చింది. ఆయన ట్యాలెంట్‌ను గుర్తించిన యడ్యూరప్ప.. తన శిష్యుడిగా మార్చుకున్నారు. రాజకీయాల్లో మరింత శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీగా నియమించారు. అంతకు ముందు జరిగిన 1994 ఎన్నికల్లో కూడా అనంతకుమార్ తెరవెనుక చాలా కృషి చేశారు. 1989లో కేవలం నాలుగు సీట్లు ఉన్న బీజేపీ 1994లో 44 సీట్లకు ఎగబాకింది. ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఆ మార్పు వెనుక అనంతకుమార్ ఉన్నారనేది బీజేపీ శ్రేణులు చెప్పే మాట. ఆ రకంగా యడ్యూరప్ప తర్వాత రాష్ట్ర బీజేపీలో ఆయనే నెంబర్ 2 అనే స్థాయికి ఎదిగారు. 1996 నుంచి 2014 వరకు మొత్తం ఆరుసార్లు ఆయన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఓటమి ఎరుగని నేతల్లో ఆయన కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని మీద రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వచ్చి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేశాం. అనంతకుమార్ మా కుటుంబసభ్యుడు లాంటివాడు. ఓ రకంగా చిన్న తమ్ముడు. బెంగళూరులో ఉండడానికి లేకపోతే ఐదేళ్లు నా దగ్గరే ఉన్నాడు. అతడిది కష్టపడేతత్వం. వినమ్రుడు కూడా. మాది దాదాపు 40 ఏళ్ల అనుబంధం. 59 ఏళ్ల వాడు చనిపోయాడు. ఏం చెప్పాలో కూడా నోట మాట రావడం లేదు.
న్యూస్‌18తో యడ్యూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు


1998లో జరిగిన ఎన్నికల్లో లోక్ ‌సభకు రెండోసారి ఎన్నికయ్యారు. ఈసారి భారీ మెజారిటీ సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో విమానయాన శాఖ, టూరిజం మంత్రిగా నియమితులయ్యారు. అప్పటికి ఆయన వయసు 38 సంవత్సరాలు. వాజ్‌పేయి కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు అనంతకుమారే. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్‌ను ఓడించారు. అప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను అందుకున్నారు.
2003లో కేంద్ర మంత్రి పదవిని వదులుకుని రాష్ట్రం మీద దృష్టిపెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2004 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేశారు. అనంతకుమార్ సారధ్యంలో ఆ ఎన్నికల్లో బీజేపీ 79 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2004లో కేంద్రంలో ఎన్డీయే ఓడిపోయింది. పదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే, పార్టీలో మాత్రం అనంతకుమార్‌కు కీలక పదవులు దక్కాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పార్టీలో అత్యంత పవర్ ఫుల్ అయిన పార్లమెంటరీ బోర్డులో స్థానం దక్కింది.


బీజేపీలో ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా కూడా ఆయనకు రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోనూ ఆయనకు మంచి మిత్రులు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీలో ఏం పనులు కావాలన్నా కూడా ఆయనను పట్టుకుంటే అవుతుందనే అభిప్రాయం చాలా మందికి ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన జేహెచ్ పటేల్ నుంచి నేటి కుమారస్వామి వరకు ఢిల్లీలో అనంతకుమార్‌ సాయం తీసుకునేవారే. జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనేది అనంతకుమార్ ఆకాంక్ష అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దాని వల్లే యడ్యూరప్ప, అనంతకుమార్ మధ్య వివాదం తలెత్తినట్టు చెబుతారు. కర్ణాటకను శాసిస్తున్న కుల రాజకీయాల మధ్య ఓ బ్రాహ్మణుడు సీఎం అవడం కొంత కష్టమే అని ఆయనకు కూడా తెలుసు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆయనకు కష్టకాలం మొదలైందని చాలా మంది భావించారు. ఎల్‌కే అద్వానీకి అనుంగు శిష్యుడిగా భావించే అనంతకుమార్‌ మోదీ కేబినెట్‌లో కూడా చోటు దక్కించుకున్నారు.


అనంతకుమార్ తండ్రి నారాయణశాస్త్రి. రైల్వేల్లో ఇంజినీర్. తల్లి లలితా శాస్త్రి. హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు తోటి కార్యకర్త తేజస్వినిని పెళ్లి చేసుకున్నరు. వారికి ఇద్దరు పిల్లలు. వారి వివాహానికి యడ్యూరప్ప కూడా హాజరయ్యారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 12, 2018, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading