Worlds Largest Zoo in Gujarat: ఆయిల్ టు టెలికాం భిన్న రంగాల్లో వేళ్లూనుకుని ఉన్న ప్రఖ్యాత వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జూ ను నిర్మించాలని సంకల్పించింది. గుజరాత్లోని జామ్ నగర్లో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలో అతి పెద్ద జూ అంటే వైశాల్యంలో కాదు. అందులో ఉండే జంతువులు, పక్షులు, సరీసృపాలు, ఇలాంటి వాటిలో. ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో స్పీసిస్ ఇక్కడ ఉంటాయి. ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు. ఈ జూ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అనుమతులు మంజూరు చేశాయి. పర్మిషన్స్ రావడంపై రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్, కార్పొరేట్ అఫైర్స్ పర్యవేక్షిస్తున్న పరిమళ్ నత్వానీ ఆనందం వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద జూ గుజరాత్లోని జామ్నగర్లో రాబోతోంది. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మిస్తోంది. దీన్ని ‘గ్రీన్స్ జియోలాజికల్, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్ డమ్’ పిలవనున్నారు. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందాం. ఇందులోకి ప్రజలకు కూడా అనుమతి ఉంటుంది. ప్రపంచంలోనే బెస్ట్ జూగా పేరు సంపాదిస్తుంది. కరోనా వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది. మహమ్మారి కారణంగా మరే ఇతర సమస్యలు రాకపోతే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని మేం ఆశిస్తున్నాం.’ అని పరిమళ్ నత్వానీ చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శి ఎంకే దాస్ మాట్లాడుతూ జామ్ నగర్లో రిఫైనరీని నడుపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జూను నిర్మిస్తుందని చెప్పారు. అసోచాం ఫౌండేషన్ వీక్ వర్చువల్గా నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఓ ప్రజెంటేషన్ ఇస్తూ రిలయన్స్ నిర్మిస్తున్న జూ గురించి వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) గుజరాత్లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పెద్దదైన జూ కూడా గుజరాత్లోని జామ్ నగర్లో త్వరలో రాబోతోంది.’ అని దాస్ వెల్లడించారు. రిలయన్స్ నిర్మిస్తున్న ఈ జూ సుమారు 250.1 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని సెంట్రల్ జూ అధారిటీ తెలిపింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 19, 2020, 20:33 IST