news18-telugu
Updated: January 13, 2020, 10:21 AM IST
బెలూర్ మఠంలో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇబ్బంది పెట్టే పరిణామం బెంగాల్లో జరిగింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా... మోదీ... హౌరాలోని... రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రమైన బెలూర్ మఠానికి వెళ్లిన విషయం మనకు తెలుసు. స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా మోదీ... దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలో... CAA (పౌరసత్వ సవరణ చట్టం)పై లేని పోని అపోహలు వద్దన్నారు. ప్రతిపక్షాలు దీనిపై ద్వంద్వార్థాలు తీసి... ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేదే కానీ... రద్దు చేసేది కాదని అన్నారు. ఐతే... ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని గానీ, వ్యతిరేకిస్తున్నామని గానీ... రామకృష్ణ మఠం చెప్పేందుకు ఇష్టపడలేదు. మోదీ ఓ అతిథిగా వచ్చారనీ... ఆయన మాట్లాడకూడని (రాజకీయ అంశాలు) మాట్లాడితే... దానికి తాము బాధ్యులం కాదనీ... అలాంటి వ్యాఖ్యలపై బాధ్యత ఆతిథ్యం ఇచ్చేవారికి ఉండదని స్పష్టం చేసింది. తమది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అన్న రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద... తమ సంస్థలో అన్ని మతాలవారూ ఉన్నారనీ, అందరూ సోదరుల్లా ఉంటారని తెలిపారు. అందువల్ల మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు సున్నితంగా తిరస్కరించారు. మోదీ వెళ్లిన తర్వాత జరిగిన రిపోర్టర్ల మీటింగ్లో ఆయన ఇలా అన్నారు. తద్వారా ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని సమర్థించట్లేదని ఆయన పరోక్షంగా చెప్పినట్లైంది.
రామకృష్ణ మఠం ఉన్నది బెంగాల్లో. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం... CAA, NRCలను వ్యతిరేకిస్తోంది. అందువల్ల బెంగాల్లో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో CAAను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ మఠం... మోదీ వ్యాఖ్యలపై దూరం జరగడం చర్చనీయాంశమైంది. మోదీ వ్యాఖ్యల్ని సమర్థించి ఉంటే... అది బెంగాల్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారేది. సమర్థించకుండా దూరంగా ఉండటం వల్ల మోదీకి అది ఇబ్బందికర పరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Published by:
Krishna Kumar N
First published:
January 13, 2020, 10:21 AM IST