news18-telugu
Updated: June 19, 2020, 12:34 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఏపీలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్ర 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్‌కు ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఇక టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో ఉన్నారు.
మొత్తం 9 రాష్ట్రాల్లో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో 4, జార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్‌లో 3, మణిపూర్, మేఘాలయలో ఒక్కో సీటుకు ఎన్నికలు జరగున్నాయి. మిగిలిన ఆరు సీట్లలో కర్ణాటకలో నాలుగు సీట్లు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, మిజోరాంలో మరో సీటు ఉంది. మరోవైపు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగనున్నాయి. గుజరాత్‌లోని నాలుగు సీట్లకు బీజేపీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ ఇద్దరిని రేసులో ఉంచింది. దీంతో కాంగ్రెస్ పోటీలో ఉన్న ఇద్దరు గెలుస్తారా ? లేక బీజేపీ తరపున బరిలో ఉన్న ముగ్గురు విజయం సాధిస్తారా ? అన్నది ఉత్కంఠగా మారింది. ఇక మధ్యప్రదేశ్‌లోని మూడు సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో రెండు పార్టీల్లో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొద్ది నెలల క్రితం ఈ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ నుంచి బీజేపీ సొంతమైంది. ఇక రాజస్థాన్‌లోనూ ఇరు పార్టీ మధ్య పోటీ గట్టిగానే ఉంది. మూడు సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది.
Published by:
Kishore Akkaladevi
First published:
June 19, 2020, 9:27 AM IST