Parliament: నిరాహారదీక్షను విరమించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్

దీక్ష విరమిస్తున్న హరివంశ్

వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా తన పట్ల విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హరివంశ్ పార్లమెంట్ ఆవరణలో దీక్షకు దిగారు. 24 గంటల అనంతరం ఆయన దీక్షను విరమించారు.

  • Share this:
    పార్లమెంట్ ఆవరణలో రెండు రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు తెరపడింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ దీక్షను విరమించారు. జేడీయూ సభ్యులు ఆయకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా తన పట్ల విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హరివంశ్ పార్లమెంట్ ఆవరణలో దీక్షకు దిగారు. 24 గంటల అనంతరం ఆయన దీక్షను విరమించారు. ఇవాళ యథావిధిగా రాజ్యసభ సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు.

    ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రచ్చ జరిగింది. బిల్లులను వ్యతిరేకిస్తూ పలువురు విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకొని నినాదాలు చేశారు. బిల్లు కాపీలను చింపివేయడంతో పాటు రూల్ బుక్‌ని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్‌పై విసిరేశారు. ఆ గందరగోళం మధ్యే మూజువాణి ఓటుతో మూడు వ్యవసాయ బిల్లులను ఆయన ఆమోదించారు. ఐతే ఓటింగ్ సమయంలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. డిప్యూటీ ఛైర్మన పట్లు దురుసుగా ప్రవర్తించిన 8 మంది విపక్ష సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు.

    ఐతే సస్పెన్షన్‌కు నిరసనగా 8 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం రాత్రంతా దీక్ష చేశారు. మంగళవారం ఉదయాన్నే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ టీ తీసుకుని అక్కడికి వెళ్లారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు కప్పుల్లో టీ పోసి ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఎంపీలు తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో మరోసారి తనకు అవమానం ఎదురయిందని భావించిన హరివంశ్.. తన ఆవేదనను వివరిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు 3 పేజీల లేఖ రాశారు. అనంతరం 24 గంటల పాటు దీక్షకు కూర్చున్నారు. తన దీక్షతోనైనా సస్పెండైన ఎంపీలకు ఆత్మశుద్ధి కలగాలని ఆయన ఆకాంక్షించారు.

    కాగా, హరివంశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పాటు అవమానించిన వారికి వ్యక్తిగతంగా డిప్యూటీ చైర్మన్ టీ తీసుకెళ్లడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప సందేశమన్న ప్రధాని.. ఈ సందర్భంగా హరివంశ్‌ను అభినందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: