RAJYA SABHA ALSO PASSES FARM LAWS REPEAL BILL 2021 AMID UPROAR FROM OPPOSITION MKS
Parliament : ఇక చెత్తబుట్టలోకి సాగు చట్టాలు -రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం -రాష్ట్రపతి సంతకం లాంఛనమే
సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో పెట్టిన వ్యవసాయ మంత్రి తోమర్
మూడు సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. అంతకుముందు లోక్ సభలోనూ ఈ బిల్లు పాస్ కావడంతో పది రోజుల కిందట ప్రధాని మోదీ చేసిన ప్రకటన నెరవేరినట్లయింది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం లాంఛనమే.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు ఇక చెత్త బుట్టలోకి వెళ్లనున్నాయి. మూడు సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. అంతకుముందు లోక్ సభలోనూ ఈ బిల్లు పాస్ కావడంతో పది రోజుల కిందట ప్రధాని మోదీ చేసిన ప్రకటన నెరవేరినట్లయింది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం లాంఛనమే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ముందుగా లోక్ సభలో, ఆ వెంటనే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. అయితే, ఉభయ సభల్లోనూ దీనిపై చర్చకు ఎలాంటి అవకాశమివ్వలేదు. సాగు చట్టాలు తెచ్చిన సందర్భంలో, మళ్లీ ఇప్పుడు రద్దు చేసిన తరుణంలో చర్చ లేకుండానే తంతు ముగించడంతో మోదీ సర్కారుపై విపక్షాలు మండిపడుతున్నాయి.
సాగు చట్టాల రద్దు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న కాసేపటికే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమరే రాజ్యసభలోనూ బిల్లును పెట్టారు. లోక్ సభలాగే రాజ్యసభలోనూ చర్చ కోసం విపక్షాలు పట్టు పట్టడంతో సభలో అరుపులు, నినాదాలు వినిపించాయి. చివరికి లోక్ సభ మాదిరిగానే గందరగోళం మధ్యే రాజ్యసభలోనూ మూజువాణి ఓటుతో సాగు చట్టాలు రద్దయినట్లు సభాపతి ప్రకటించారు. ఈ బిల్లును ఇవాళే రాష్ట్రపతి భవన్ కు పంపుతారని తెలుస్తోంది. వీటిపై రాష్ట్రపతి సంతకం లాంఛనమే.
సాగు చట్టాల రద్దు బిల్లుపై రెండు సభల్లోనూ చర్చ జరపకపోవడాన్ని బట్టి మోదీ సర్కారు పిరికితనం మరోసారి బయటపడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ‘చట్టాలు చేసినప్పుడు చర్చ లేదు.. వాటిని రద్దు చేసినప్పుడూ ఎవరినీ మాట్లాడనీయలేదు.. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇదొక కొత్త విధానం..’అంటూ ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఎద్దేశా చేశారు. రెండు సభల్లోనూ సాగు చట్టాల రద్దు బిల్లుపై తాము గట్టిగా ప్రయత్నించినా చర్చ లేకుండా ప్రభుత్వం ప్రక్రియను ముగించేసిందని విపక్షనేతలు మండిపడ్డారు.
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఓ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. సరిగ్గా 10 రోజుల వ్యవధిలోనే రద్దు ప్రక్రియ పూర్తయింది. కాగా, సాగు చట్టాల రద్దుతో తమ ఉద్యమాన్ని విరమించబోమని, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టంతోపాటు మరో ఐదు డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఆందోళనలను విరమిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. బిల్లుల రద్దుకు ఆమోదం.. ఏడాది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు నివాళి అని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేసినప్పటికీ, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సమస్య పెండింగ్‌లోనే ఉందని, అందువల్ల తమ నిరసనలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.