RAJYA SABHA ALSO PASSES ELECTION LAWS AMENDMENT BILL TO ALLOW VOTER ID LINKING WITH AADHAAR AMID OPPN PROTEST MKS
Aadhaar-Voter ID link : రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం.. ఇక చట్టంగా ‘ఓటర్ ఐడీకి ఆధార్ లింకు’
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లుకు మంగళవారం రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. ఇది సోమవారం నాడు లోక్ సభలో పాసైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన సతకంతో ప్రక్రియ పూర్తవుతుంది.
భారత ఎన్నికల వ్యవస్థలో సంచలన సంస్కరణగా భావిస్తోన్న ‘ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం’ ప్రక్రియ ఇక చట్టంగా మారనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లుకు మంగళవారం రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. ఇది సోమవారం నాడు లోక్ సభలో పాసైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన సతకంతో ప్రక్రియ పూర్తవుతుంది. లోక్ సభలాగే రాజ్యసభలోనూ ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానంపై విపక్షాలు నిరసన తెలిపాయి. ఆధార్ చట్టం ప్రకారం దానిని ఓటరు జాబితాకు లింక్ చేయడం చట్ట విరుద్ధమని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి పట్టింపు లేకపోవడంతో వారు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతా అధికార పక్షం ఎంపీలతోనే మూజువాణి ఓటుతో ఎన్నికల సవరణ బిల్లు రాజ్యసభలో పాసైంది.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు ఎన్నికల చట్టాల సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ.. బోగస్ ఓట్లర్ల ఉదంతాలు చాలా సందర్భాల్లో చోటుచేసుకున్నాయని, ఇంతకుముందెప్పుడూ వాటిని ఏరివేసే వ్యవస్థ లేదని, తాజా చట్ట సవరణతోనే అది సాధ్యమైందన్నారు. విపక్షాల నిరసనలన్ని ఉద్దేశించి మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోగస్ ఓటర్ల ఏరివేతను వ్యతిరేకించేవాళ్లు మాత్రమే ఈ బిల్లులపై వ్యతిరేకత తెలుపుతున్నారని రిజిజు ఎద్దేశా చేశారు.
ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అనేవి సుదీర్ఘకాలంగా నానుతోన్న అంశం. ఎన్నికల వ్యవస్థను, ప్రక్రియను, ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) గత జులైలో కేంద్రానికి కొన్ని సిఫార్సులు పంపింది. వాటిలో కీలకమైనవిగా కేంద్రం భావించిన అంశాలతో ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 రూపొందింది. ఎన్నికల విధానంలో అవకతవకలకు చెక్ పెట్టడం, నకిలీ ఓట్లను నిరోధించడం, బోగస్ ఓట్ల తొలగింపు, అవకతవకల్లేని ఓటరు జాబితా తదితర లక్ష్యాలు ఈ బిల్లుతో సాధ్యమవుతాయని కేంద్రం భావిస్తోంది, ఎన్నికల చట్టాల సవరణ బిల్లులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి.
నకిలీ ఓట్లు, ఇతరత్రా అవకతవకల్ని నివారించడానికి ఓటరు ఐడీకి ఆధార్ ను లింక్ చేయడం అవసరమనేది ఈ బిల్లులో ప్రధానాంశం. కొత్త బిల్లు ద్వారా ఇకపై ఏడాదికి నాలుగు సార్లు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే వీలుంటుంది. ఇకపై మహిళా సర్వీస్ ఓటరు భర్తకు కూడా పోస్టల బ్యాలెట్ అవకాశం కల్పిస్తారు. ఎన్నికల సమయంలో స్కూళ్లు, ఇతర ప్రదేశాలను ఈసీ స్వాధీనం చేసుకోవడంపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈసీకి అలాంటి అడ్డంకులు రాకుండా అధికారాలను పెంచనున్నారు. ఈ నాలుగు అంశాల్లో మూడింటికి అందరూ సమ్మతిస్తున్నా, ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానాన్ని మాత్రం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.