హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India-China: చైనాతో గొడవలపై పార్లమెంట్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ కీలక ప్రకటన

India-China: చైనాతో గొడవలపై పార్లమెంట్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ కీలక ప్రకటన

రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్

రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్

మన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

చైనా, ఇండియా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతన్న విషయం తెలిసిందే. లద్దాఖ్ సమీపంలో భారత బలగాలను చైనా రెచ్చగొడుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఐతే చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని విపక్షాలు కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా, భారత్ గొడవలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత జవాన్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. మన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్.

'' సెప్టెంబరు నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇరు వైపుల నుంచి ప్రయత్నాలు ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయి. లద్దాఖ్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చాం. ఈ ఒప్పందం వద్ద భారత్ ఏమీ నష్టపోలేదని చెబుతున్నా. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఫింగర్ 8వ వద్ద చైనా బలగాలు ఉంటాయి. భారత బలగాలు ఫింగర్ 2 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ వద్ద ఉంటాయి.'' అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.


''తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను తరలించింది. మన సైన్యం కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. చైనాను ఎదుర్కొనేందుకు సమర్థ బలగంతో సిద్ధంగా ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మన భద్రతా బలగాలు రుజువు చేశాయి’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.


‘సరిహద్దు సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముందు నుంచీ చెబుతున్నాం. వాస్తవాధీన రేఖను ఇరు దేశాలు అంగీకరించాలి. ఏకపక్ష ధోరణి ఆమోదయోగ్యం కాదని చైనాకు అర్థమయ్యేలా వివరించాం. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇరుదేశాలు దశల వారీగా పరస్పర సమస్వయంతో బలగాలను ఉపసంహరించుకోనున్నాయి. దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో మనం ఎంత పట్టుదలగా ఉంటామో చైనాకు తెలుసు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు భారత్‌తో కలిసి చైనా పనిచేస్తుందని భావిస్తున్నాం’’ అని రాజ్‌నాథ్ రాజ్యసభలో పేర్కొన్నారు.


''1962 యుద్ధం అనంతరం చైనా 39వేల చ.కి.మీ ఆక్రమించింది. లద్దాఖ్‌లోని 5,180 కి.మి. భూమిని పాకిస్తాన్‌ చట్ట విరుద్ధంగా చైనాకు ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 90వేల చ.కి.మీ. భూమి తమదేనని చైనా వాదిస్తోంది. కానీ మేం దాన్ని అంగీకరించడం లేదు.'' అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాగా, గత ఏడాది లద్దాఖ్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వన్ లోయలో జరిగి ఇరువర్గాల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు 45 మంది మరణించి ఉంటారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

First published:

Tags: India-China, Indo China Tension, Ladakh, Rajnath Singh

ఉత్తమ కథలు