news18-telugu
Updated: November 2, 2018, 3:07 PM IST
ప్రతీకాత్మక చిత్రం
భద్రతా దళాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. దేశంలో భారీ స్థాయిలో రిక్రూట్ మెంట్ జరగనుంది. దేశంలోని ఆరు భద్రతా దళాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు అవసరమైతే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం, కేంద్ర హోంశాఖ సెక్రటరీ రాజీవ్ గైబా, పారామిలటరీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో రాజ్‌నాధ్ సమావేశం నిర్వహించారు. ఖాళీల భర్తీ కోసం ఓ టైమ్ అనుకుని ఆ సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇప్పటి వరకు అందిన రికార్డుల ప్రకారం దేశంలోని ఆరు భద్రతా విభాగాల్లో కలిపి సుమారు 55 వేల ఖాళీలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్దదైన సీఆర్పీఎఫ్లో 21వేలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 16వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటిన్ బోర్డర్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో కూడా బాగానే ఖాళీలు ఉన్నాయి. గత రెండేళ్లలో సుమారు 1.35లక్షల మంది సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరారు. అందులో 233 డీఎస్పీలు, 140 డీఐజీ, కమాండెంట్స్ పోస్టులు కూడా ఉన్నాయి. భద్రతా విభాగాల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీలు ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరు పదవీ విరమణ చేస్తున్నారు. మరికొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఇంకొందరు కాల్పుల్లో చనిపోతున్నారు. వీటితోపాటు కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. దీంతోపాటు కొత్త బెటాలియన్లను నెలకొల్పాలని చూస్తోంది. దీంతో వెంటనే 55వేల ఖాళీలను భర్తీ చేయాలని రాజ్‌నాధ్ ఆదేశించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 2, 2018, 3:07 PM IST