తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన రజినీకాంత్... తాజాగా ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులతోపాటు ప్రజలకు నిరాశ కలిగిస్తుందనే విషయం తనకు తెలుసన్న రజినీకాంత్.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలని వారిని కోరారు.
రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. తన అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నాత్తై సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారని రజినీకాంత్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజినీకాంత్.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్మకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు.
త్వరలోలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కొద్దివారాల క్రితం ప్రకటించిన రజినీకాంత్.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నె 31న ప్రకటిస్తానని వెల్లడించి తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి పెంచారు. అయితే అంతకుముందే తాను ఒప్పుకున్న అన్నాత్తై సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావించిన సూపర్ స్టార్.. అందుకోసం హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కొందరికీ కరోనా అని నిర్ధారణ కావడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ నెల 25న రజినీకాంత్‌కు ఉన్నట్టుండి బీపీ పెరగడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో ఆయన ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైంది. రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. చెన్నై చేరుకున్నారు.
అయితే చెన్నై చేరుకున్న వెంటనే తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కుటుంబసభ్యులతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో... రాజకీయ పార్టీ ఏర్పాటు వద్దని కుటుంబసభ్యులు ఆయనకు సూచించినట్టు సమాచారం. రాజకీయాల్లోకి అడుగుపెడితే.. ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని కొందరు సన్నిహితులు రజనీకాంత్‌కు సలహా ఇచ్చారని తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న రజినీకాంత్.. కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పట్లో వద్దని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth