హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత.. రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా ?

Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత.. రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా ?

రజినీకాంత్ (ఫైల్ ఫోటో)

రజినీకాంత్ (ఫైల్ ఫోటో)

Rajinikanth Health Condition: ఉన్నట్టుండి రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో.. ఈ నెల 31న రజినీకాంత్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా లేదా అన్నది తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ నెల 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని గతంలోనే వెల్లడించిన రజినీకాంత్.. హఠాత్తుగా ఆస్పత్రి పాల్వడం ఆయన అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు చాలాకాలం క్రితమే ప్రకటించిన రజినీకాంత్.. సొంత పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు కొద్ది వారాల క్రితమే ప్రకటించారు. దీంతో తలైవా పొలిటికల్ పార్టీ ఎలా ఉండబోతోందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రజినీకాంత్ పార్టీ ప్రకటించిన తరువాత తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని చాలామంది అంచనా వేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న అన్నాత్తై సినిమా షూటింగ్‌ను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని భావించిన రజినీకాంత్.. పార్టీ ప్రకటించడానికి ముందే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. అయితే షూటింగ్ సమయంలో పలువురికి కరోనా సోకడంతో.. అది వాయిదా పడింది. ఆయన కూడా ఐసొలేషన్‌లో ఉంటున్నారు. సినిమా షూటింగ్ వాయిదా పడినా.. తమ అభిమాన హీరోకు కరోనా సోకలేదని వార్త ఆయన ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది.

అయితే ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురికావడంతో.. ఈ నెల 31న రజినీకాంత్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా లేదా అన్నది తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తుందని.. బీపీలో హెచ్చుతగ్గులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అపోలో డాక్టర్లు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని ప్రకటించింది. రజినీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ.. ఆయన కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని.. కాబట్టి ముందుగా అనుకున్నట్టు ఈ నెల 31న కొత్త పార్టీ ప్రకటన ఉండకపోవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

First published:

Tags: Rajinikanth, Tamilnadu

ఉత్తమ కథలు