తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడానికి మరో 20రోజులు కూడా లేదు. ఈ సమయంలో రజినీకాంత్‌కు షాకింగ్ న్యూస్. రజినీకాంత్‌కు సమన్లు అందే అవకాశం ఉంది. 2018 మే నెలలో తూత్తుకుడైలోని స్టెరిలైట్ ఫైరింగ్ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న సింగల్ జడ్జి కమిషన్ రజినీకాంత్‌కు కూడా సమన్లు జారీ చేయనున్నట్టు తెలిసింది. స్టెరిలైట్ ఉద్యమం సమయంలో రజినీకాంత్ కామెంట్ చేశారు. దీంతో ఆయనకు నోటీసులు అందనున్నట్టు సమాచారం. తూత్తుకుడైలో స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న సమయంలో అందులోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డారని, అందుకే ఆ ఉద్యమం హింసాత్మకంగా మారిందన్నారు. అప్పుడు జరిగిన పోలీస్ ఫైరింగ్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమంపై రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీశన్ కమిషన్ విచారణ జరుపుతోంది. జనవరిలో ఈ కమిషన్ తమ 24వ సిట్టింగ్ జరపనుంది. కమిషన్ తరఫు న్యాయవాది అరుల్ వడివేల్ చెప్పిన వివరాల ప్రకారం రజినీకాంత్‌కు జనవరిలో నోటీసులు వచ్చే అవకాశం ఉంది. 2020 ఫిబ్రవరిలో కూడా రజినీకాంత్‌కు సమన్లు అందాయి. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. అయితే, 2021 జనవరిలో మరోసారి సూపర్ స్టార్‌కు సమన్లు అందనున్నాయి.
రజినీకాంత్ ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా అన్నాత్తై సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఆ లోపే డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటన పనిలో రజినీకాంత్ బిజీగా ఉన్నాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు దాదాపు ఖరారైంది. డిసెంబర్ 31న ప్రకటించబోయే పార్టీకి సంబంధించి తన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించారు. రజినీకాంత్ కొత్త పేరు కాకుండా ఇప్పటికే రిజిస్టర్ అయిన ఓ పార్టీని తీసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) ని తీసుకుంటున్నారు. అలాగే, ఆ పార్టీ సింబల్‌గా ఆటో రిక్షా కోసం దరఖాస్తు చేశారు. రాష్ట్రం మొత్తం పోటీ చేస్తామని, అన్ని చోట్లా ఒకటే గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
మరోవైపు రజినీకాంత్ మీద అధికార అన్నాడీఎంకే పార్టీ మండిపడింది. రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ పేరును హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇటీవల కమల్ హాసన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మధురైను తమిళనాడు రెండో రాజధానిగా చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం తన కోరిక మాత్రమే కాదని, ఎంజీఆర్ కూడా ఇదే కలగన్నారని చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 18, 2020, 15:57 IST