త్వరలోనే రాజకీయ పార్టీని పెట్టనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 31న పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తానని ఇప్పటికే ప్రకటించిన రజనీకాంత్.. ప్రస్తుతం తన రాజకీయ పార్టీ విధివిధానాలు ఏ రకంగా ఉండాలనే దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తమ అభిమాన హీరో రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు.. మరో విషయంలోనూ రజనీకాంత్ క్లారిటీ ఇవ్వాలని అవసరం ఉందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తనకు సిఎం అయ్యే ఉద్దేశం ఏమాత్రమూ లేదని, సీఎం బాధ్యతలను దీర్ఘదృష్టి, చతురత కలిగిన ఓ యువనాయకుడికి కట్టబెట్టాలని గతంలో ఆయన కామెంట్ చేశారు. అయితే తాజాగా దీనిపై రజనీకాంత్ మనసు మార్చుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిగా రజనీనే ఉండాలని, అలా అని రజనీతోనే చెప్పించేలా ఆయన మనసు మార్చేందుకు అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తాను స్థాపించబోయే పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతాననే విషయాన్ని రజనీకాంత్.. ముందుగానే ప్రకటించాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారని సమాచారం. ఇదే విషయాన్ని వారంతా రజనీకాంత్ సన్నిహితుల దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది. మొత్తంగా కచ్చితంగా సొంత పార్టీ పెట్టాలని కోరిన ఫ్యాన్స్ కోరికను అంగీకరించిన రజనీకాంత్.. తన కొత్త పార్టీ తరపున తానే సీఎం అభ్యర్థిగా ఉంటాననే విషయాన్ని కూడా ముందుగానే ప్రకటిస్తారేమో చూడాలి.
మరోవైపు రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు తరువాత తమిళ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో పాటు ఇతర పార్టీల నుంచి రజనీకాంత్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tamilnadu