నాలుగేళ్ల పాటుజైలు జీవితం అనుభవించి రిలీజ్ అయిన తమిళ చిన్నమ్మ శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తనకు రజినీకాంత్ ఫోన్ చేశారని, శశికళ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని దినకరన్ వెల్లడించారు.
నాలుగేళ్ల పాటుజైలు జీవితం అనుభవించి రిలీజ్ అయిన తమిళ చిన్నమ్మ శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తనకు రజినీకాంత్ ఫోన్ చేశారని, శశికళ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని దినకరన్ వెల్లడించారు. ఈ రోజు దినకరన్ మీడియాతో మాట్లాడారు. ‘శశికళ ఆరోగ్యం గురించి నాకు ఫోన్ చేసిన మొట్ట మొదటి వారిలో రజినీకాంత్ కూడా ఒకరు. ఆయన ఫోన్ చేశారు. చిన్నమ్మ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. 24 గంటల ప్రయాణం తర్వాత కూడా ఆమె బాగానే ఉన్నారు.’ అని దినకరన్ తెలిపారు. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు చోట్ల పోటీచేస్తానని చెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే నగర్లో మరోసారి పోటీ చేస్తానన్న ఆయన మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నామని, ఎక్కడ అనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. శశికళ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా? లేదా? అనే అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు దినకరన్ చెప్పారు.
అన్నాడీఎంకేలో తమ స్లీపర్ సెల్స్ ఉన్నారని నాలుగేళ్లుగా చెబుతున్న దినకరన్ వారిలో ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఉన్నారని తెలిపారు. వారంతా త్వరలోనే బయటకు వస్తారన్నారు. శశికళ మీద జనంలో ఏ మాత్రం అభిమానం తగ్గలేదని చెప్పడానికి ఆమెకు దక్కిన ఘనస్వాగతమే సాక్ష్యం అని దినకరన్ చెప్పారు. తమ ప్రధాన శత్రువు డీఎంకే అని, తాను AMMK పార్టీ పెట్టింది కేవలం అన్నాడీఎంకేను మళ్లీ కైవసం చేసుకుని రాష్ట్రంలో జయలలిత ‘అమ్మ’ ప్రభుత్వం తీసుకురావడానికేనని స్పష్టంచేశారు.
శశికళ జైలు నుంచి రిలీజ్ అవుతున్న సందర్భంలో చెన్నైలోని జయలలిత మెమోరియల్, అమ్మ స్మారక కేంద్రాన్ని మెయింటెనెన్స్ కోసం మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జైలుకు వెళ్లే ముందు శశికళ జయలలిత సమాధి వద్ద కొట్టి శపథం చేసిందనే ప్రచారం నేపథ్యంలో ఆమె జైలు నుంచి రిలీజ్ అవుతున్న వేళ అసలు ఆమె జయ సమాధి వద్దకు కూడా వెళ్లనివ్వకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని భావించారు. దీనిపై దినకరన్ స్పందించారు. తాము అక్కడకు వెళ్తామన్న భయంతో వారు నిర్వహణ పేరుతో వాటిని మూసేశారని తాము వారిలా చేయబోమని (ఓ పన్నీర్ సెల్వం తిరిగి అన్నాడీఎంకేలో చేరడం) అన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష ముగించుకున్న జయలలిత నిచ్చెలి వీకే శశికళ సోమవారం బెంగళూరు నుంచి తమిళనాడుకు వెళ్లారు. తమిళనాడు సరిహద్దుల్లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమె తమిళనాడులోకి ప్రవేశించగానే అనుచరులు ఏకంగా హెలికాఫ్టర్‌తో పూల వాన కురిపించారు. వందల మంది శశికళ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు శశికళతో సెల్ఫీ తీసుకునేందుకు బైక్‌పై ఆమె కాన్వాయ్‌ను వెంబడించాడు. అయితే.. శశికళ అనుచరులు అతనిని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. కారులో నుంచి ఆ యువకుడిని గమనించిన శశికళ కారు ఆపి మరీ ఆ యువకుడి వద్దకు వెళ్లారు. ఆ యువకుడితో సెల్ఫీ దిగారు. అనంతరం.. శశికళ తమిళనాడు సరిహద్దు జిల్లా కృష్ణగిరికి చేరుకున్నారు. తమిళనాడులో ప్రవేశించగానే ఆమె ప్రయాణిస్తున్న కారులో కాకుండా మరో కారులో ఎక్కడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కారుపై అన్నాడీఎంకే జెండాను ఉపయోగించినందుకు శశికళకు కృష్ణగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.