వావ్... స్కూళ్లలో నో బ్యాగ్ డే... ప్రతి శనివారం అమలు...

No Bag Day : కొన్ని కొన్ని విషయాలు వినడానికి ఎంతో హాయినిస్తాయి. ఇది విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది.

news18-telugu
Updated: February 21, 2020, 7:27 AM IST
వావ్... స్కూళ్లలో నో బ్యాగ్ డే... ప్రతి శనివారం అమలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Rajasthan | No Bag Day : రాజస్థాన్‌లో... ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్) ప్రభుత్వం విద్యార్థులకు మేలు చేసే ఓ నిర్ణయం తీసుకుంది. అదే... ప్రతి శనివారం నో బ్యాగ్ డే. దీని ప్రకారం... ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు. ఆ రోజున విద్యార్థులు స్కూళ్లకు బ్యాగ్స్ తీసుకెళ్లాల్సిన పని లేదు. బ్యాగ్ లేకుండా... పుస్తకాలు కూడా తేవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇకపై రాజస్థాన్ ప్రభుత్వ స్కూళ్లలో శనివారం నాడు రోజూలాగా పాఠాలు చెప్పరు. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, స్కౌట్, పర్సనాల్టీ డెవలప్‌మెంట్ వంటి వేరే కార్యక్రమాలు ఉంటాయి. వాటికి పుస్తకాలతో పనిలేదన్నమాట. ఐతే... ఇక్కడో మెలిక కూడా ఉంది. ఇకపై ప్రతి శనివారం పిల్లల తల్లిదండ్రులు - టీచర్లూ కలిసి సమావేశాలు నిర్వహించాలి. పిల్లల చదువులు, ఏం చెయ్యాలనే అంశంపై చర్చించుకోవాలి. ఇలాంటివి చెయ్యకపోతే... స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయంపై పిల్లల తల్లిదండ్రులు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. స్కూల్ బ్యాగుల్ని శనివారం రద్దు చేయడం బాగానే ఉంది కానీ... టీచర్లతో మీటింగ్ ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి శనివారం తమ ఉద్యోగాలకు సెలవులేవీ ఉండవనీ... అలాంటప్పుడు తాము స్కూళ్లకు ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీలు చూసుకొని సెట్ చేసుకొని రావాలంటోంది.

అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రసంగం చేస్తూ.... ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై ప్రతి శనివారమూ విద్యార్థులకు హ్యాపీ థెరపీలా అనిపించాలని కోరారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచాలనీ, నీతి, నియమాలు నేర్పించాలని కోరారు. ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఏం చెయ్యాలో శనివారం విద్యార్థులకు నేర్పాలన్నారు. విద్యార్థుల కోసమే నిద్రాహారాలు మాని పనిచేస్తున్న తల్లిదండ్రులు... ఆ విద్యార్థులు ఎలా చదువుతున్నదీ, వాళ్లు ఎలాంటి మార్గంలో నడుస్తున్నదీ ప్రతీ శనివారమూ తెలుసుకుంటే... మంచిదే కదా అంటున్నారు గెహ్లాట్.

మరి మిగతా రాష్ట్రాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు బండెడు బుక్స్ ఉంటున్నాయి. ఎల్‌కేజీ నుంచే నుంచే భారీగా పుస్తకాల బరువు పెంచేస్తున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తాయా అన్నది మరో ఆసక్తికర అంశం.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు