Lightning: సెల్ఫీల కోసం వాచ్‌టవర్ ఎక్కిన జనాలు.. పిడుగుపాటుతో తీవ్ర విషాదం..

ప్రతీకాత్మక చిత్రం(Photo: PTI)

రాజ‌స్థాన్‌లో పిడుగులు బీభ‌త్సం సృష్టించాయి. పలుచోట్ల పిడుగులు పడిన ఘటనల్లో 18 మంది మరణించారు. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.

 • Share this:
  రాజ‌స్థాన్‌లో పిడుగులు బీభ‌త్సం సృష్టించాయి. పలుచోట్ల పిడుగులు పడిన ఘటనల్లో 18 మంది మరణించారు. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. పిడుగులు పడటంతో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టుగా అధికారులు చెప్పారు. ముఖ్యంగా జైపూర్‌లోని అమర్ పోర్ట్ సమీపంలో సరదాగా గడిపేందుకు వచ్చిన 11 మంది పిడుగుపాటుకు గురై మృతిచెందినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం బయట వాన కురుస్తుండటం, వాతావరణం చల్లగా ఉండటంతో చాలా మంది ప్రజలు అంబర్ పోర్ట్ వద్దకు చేరుకున్నారు. కొందరు అక్కడున్న వాచ్ టవర్ పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకోవడంలో మునిగిపోయారు. మరికొందరు కొండపై ఉన్నారు. అయితే ఒక్కసారిగా పిడుగులు పడటంతో వాచ్ టవర్ పై నున్న వారు కిందపడిపోయారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 8 మంది గాయపడినట్టు జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. రాజస్తాన్ అసెంబ్లీ చీఫ్ విప్ మహేశ్ జోషి, ఎమ్మెల్యే అమీన్ కాగ్జీ.. ఎంఎమ్‌ఎస్ ఆస్పత్రికి వెళ్లి పిడుగుపాటులో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి అవసరమైన చికిత్స అందించాలని వైద్యులు, అధికారులను ఆదేశించారు.

  ఇక, రాజస్తాన్‌ కోటా జిల్లాలోని కన్వాస్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్దా గ్రామంలో వర్షం పడుతుంటంతో చెట్టు కింద ఆగిపోయిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. వారిని పుఖ్రాజ్ బంజారా, రాధే బంజారా, విక్రమ్, అఖ్రాజ్‌లుగా గుర్తించారు. ఈ పిడుగుపాటు వల్ల మేకలు, ఆవులు కూడా చనిపోయినట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో నలుగురు పిల్లలు, ఓ 40 ఏళ్ల మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  జహలావార్‌లోని లాల్‌గావ్‌ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పిడుగుపాటు పడటం వల్ల తారా సింగ్ అనే 23 ఏళ్ల గొర్రెల కాపారి అక్కడిక్కడే మృతిచెందాడు. రెండు బర్రెలు కూడా మృత్యువాతపడ్డాయి. ఇక, సునెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాచానా గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు బాలికలు గాయపడ్డారు. మరోవైపు ధోల్‌పూర్ జిల్లాలోని కుడిన్నా గ్రామంలో పిడుగుపాటుకు లవ్‌కుష్, విపిన్, బోలు అనే ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

  ఈ ఘటనలపై స్పందించిన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కోటా, ధోల్‌పూర్, జహలావార్, జైపూర్, బారాన్‌లో ఈ రోజు పిడుగుపాటుకు పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం’అని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్టుగా సీఎం చెప్పారు. పిడిగుపాటులో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టుగా సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. వర్షకాలంలో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: