రాహుల్ గాంధీకి అదో స్పెషల్ మూమెంట్. ఎందుకంటే తాను పుట్టినప్పుడు ఆస్పత్రిలో తనను ఎత్తుకున్న నర్సును ఆయన హత్తుకున్నారు. ఆమె కళ్లవెంట వస్తున్న ఆనందభాష్పాలను చూసిన ఆయన మురిసిపోయారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి 4.31లక్షల మెజారిటీతో గెలిచారు. అమేథీలో ఓడినా.. ఇక్కడి ప్రజలు తనకు రికార్డు మెజారిటీ కట్టబెట్టడంతో వారికి ధన్యవాదాలు తెలిపేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక గెస్ట్ హౌస్లో రాహుల్ గాంధీ బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న వయనాడ్కు చెందిన రిటైర్డ్ నర్సు రాజమ్మ వావతిల్ రాహుల్ గాంధీని కలిసేందుకు వచ్చారు. రాహుల్ బిజీ కార్యక్రమాల్లో ఉన్నా కూడా ఆమె కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు.
రాహుల్ గాంధీ పుట్టినప్పుడు ఆ రాజమ్మ వావతిల్ ఆస్పత్రిలో డ్యూటీ నర్సు. పొత్తిళ్లలో పసిబిడ్డ ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడు అయిపోయిన సందర్భాన్ని తలుచుకుని ఆమె మురిసిపోయారు. ‘ఈ చేతులతోనే నిన్ను ఎత్తుకున్నా..’ అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఆనందాన్ని చూసిన రాహుల్ కూడా పరవశులయ్యారు. ఆ రోజు ఆస్పత్రిలో జరిగిన ఘటనలను గుర్తుకు తెచ్చుచుని చెప్పిన ఆ 72 ఏళ్ల రిటైర్డ్ నర్సును హత్తుకుని భరోసా ఇచ్చారు.
ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో 1970 జూన్ 19న రాహుల్ గాంధీ జన్మించారు. ఆ సమయంలో రాజమ్మ వావతిల్ అక్కడ ట్రైనీ నర్సు. రాహుల్ గాంధీ విదేశీయుడు అనే వివాదం తలెత్తినప్పుడు ఆమె ముందుకొచ్చారు. తాను తన చేతులతోనే ఆ బిడ్డను ఎత్తుకున్నానని, రాహుల్ గాంధీ ఢిల్లీలోనే పుట్టారని స్పష్టం చేశారు.